Telugu Gateway
Telangana

బయటపడ్డ కేటీఆర్ డబల్ గేమ్

బయటపడ్డ కేటీఆర్ డబల్ గేమ్
X

ఎన్టీఆర్ పేరు విషయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ డబల్ గేమ్ బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వాట్సాప్ లో వైరల్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం ఖమ్మంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ అక్కడ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ తారక రామా రావు అనే పేరులోనే ఒక పవర్ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కు ఉన్న ఇమేజ్ కు అయన చేపట్టిన ముఖ్యమంత్రి పదవి కూడా చాలా చిన్నది అంటూ కామెంట్ చేశారు. ఇది ఇలా ఉంటే గతంలో కేటీఆర్ ఒక సారి ఆంధ్ర జ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాత్రం ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం విశేషం. ‘నాన్న తెలుగు దేశం పార్టీ లో ఉన్నప్పటినుంచి..నేను కాలేజీ, స్కూల్లో ఉన్నప్పటి నుంచి చాలా మంది అడిగారు.ఏంది ఎన్టీఆర్ పేరును పెట్టుకున్నారా మీరు అని. అసలు నిజానికి నా పేరు పెట్టే 21 వ రోజున అయన లేను కూడా లేరు. ఎన్టీఆర్ పేరుకు గాని..నా పేరు పెట్టడంలో మా నాన్న పాత్ర శూన్యం. అసలు ఆయనకు సంబంధమే లేదు.

ఎన్టీఆర్ పై అభిమానంతోనే ఆ పేరు పెట్టానని కెసిఆర్ ఇదే ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో చెప్పారు అని రాధాకృష్ణ తెలపగా... నిరభ్యంతరంగా పేరు మార్చుకుంటా. నాకేమి అభ్యంతరం లేదు. నా పేరు మార్చమని నా చిన్నప్పుడు మా తాత దగ్గర చాలా గొడవ చేశా. ఎందుకంటే రామా రావు అన్న పేరు ఈ కాలంలో...నేను చదువు కొనే రోజుల్లో కూడా ఫ్యాషన్ కాదు అంటూ వ్యాఖ్యానించారు. కానీ ఇదే కేటీఆర్ తాజాగా మాత్రం ఖమ్మంలో తారక రామారావు అనే పేరులోనే ఒక పవర్ ఉంది అని వ్యాఖ్యానించారు అంటే ఇది అంతా రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేసింది తప్ప...ఇందులో ఏ మాత్రం నిజం లేదు అనే విషయం కేటీఆర్ మాటల్లోనే తేలిపోతుంది. ఖమ్మం జిల్లాలో మారిన రాజకీయ వాతావరణంలో ఎన్టీఆర్ సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు అయన ఈ మాటలు మాట్లాడారు అనే చర్చ అప్పుడే జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన పాత వీడియోతో అదే నిజం అని తేలిపోయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it