Telugu Gateway
Telangana

కాంగ్రెస్ పేరు చెప్పి 550 కోట్ల విలువైన భూములు పొందిన బిఆర్ఎస్

కాంగ్రెస్ పేరు చెప్పి 550 కోట్ల విలువైన భూములు పొందిన బిఆర్ఎస్
X

బిఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అనుకునే ప్రమాదం

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉండగానే మొత్తానికి వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ పరం చేస్తూ పోతున్నారు. రాజధాని హైదరాబాద్ తో పాటు జిల్లాల వారీగా ఈ కార్యక్రమం సాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి కెసిఆర్ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఇలాంటి నిర్ణయమే ఒకటి తీసుకున్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్ )కి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కేంద్రానికి ఇప్పుడు ఎకరం అరవై కోట్ల రూపాయల లెక్కన ప్రభుత్వం భూములు అమ్మిన కోకాపేటలో 11 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి బిఆర్ఎస్ సర్కారు, సీఎం కెసిఆర్ లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బోయినపల్లి గ్రామంలో పది ఎకరాలు తీసుకున్న విషయాన్నీ ప్రస్తావించారు. కాంగ్రెస్ కు పాలన రాదు...కాంగ్రెస్ వల్లే దేశం నాశనం అయింది అని చెప్పే కెసిఆర్ బిఆర్ఎస్ కు వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకోవటానికి మాత్రం కాంగ్రెస్ మోడల్ ఫాలో అవుతారు అన్న మాట. ఇప్పటికే నగరం నది బొడ్డున బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఉంది. దీనికి భూమి కాంగ్రెస్ జమానాలోనే కేటాయించారు. గత ఏడాది బిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో బంజారాహిల్స్ లో ఎకరంపైగా స్థలాన్ని బిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ శాఖకు కేటాయిస్తూ జీఓ జారీ అయింది. దీని విలువే వంద కోట్ల రూపాయల పైనే ఉంటుంది అని అంచనా.

ఈ కేటాయింపుపైన విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించగా ఇప్పడు ఏకంగా శిక్షణ, మానవవనరుల అభివృద్ధి కోసం కోకాపేటలో ఏకంగా 11 ఎకరాలు కేటాయించారు. దీని విలువ తక్కువలో తక్కువ 550 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని అధికారులు చెపుతున్నారు బిఆర్ఎస్ కు . సహజంగా ఒక పరిశ్రమకు..ఐటి కంపెనీ కి భూమి కేటాయించాలంటే అది పెట్టే పెట్టు బడి ఎంత..ఎంత మంది అక్కడ ఉద్యోగాలు చేస్తారు ..అసలు ఆ కంపెనీకు ఎంత భూమి అవసరం అవుతుంది అన్నది చూసి కేటాయింపు చేయాలి. అలాంటిది ఒక పార్టీ ఆఫీస్ శిక్షణ, మానవవనరుల అభివృద్ధి ఆఫీస్ కు పదకొండు ఎకరాలు ఏమి అవసరం ఉంటుంది అని...ఇది కేవలం పార్టీ కి ఆర్థికంగా లబ్ది చేకూర్చుకోవటం తప్ప మరొకటి కాదు అని అధికారులు చెపుతున్నారు. అది కూడా హెచ్ఎండీఏ అధీనంలో ఉన్న అత్యంత విలువైన కోకాపేటలో 11 ఎకరాలు దక్కించుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు కోకాపేట ప్రభుత్వం భూములు వేలం వేస్తున్నారు. మరో వైపు పార్టీ కోసం వందల కోట్ల విలువ చేసే పదకొండు ఎకరాలు కేటాయించుకుంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవరం అంత చూస్తుంటే బిఆర్ఎస్ అంటే ప్రజలు భూముల రాష్ట్ర సమితిగా భావించే ప్రమాదం లేకపోలేదు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it