Telugu Gateway
Telangana

పాతవి వదిలేసి...కొత్త ప్రకటనలు

పాతవి వదిలేసి...కొత్త ప్రకటనలు
X

పాత హామీలు అలాగే ఉన్నాయి. తెలంగాణాలో ఇంకా రైతు రుణ మాఫీ పూర్తిగా అమలే చేయలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. రైతులకు ఉచితంగా ఇస్తామన్న ఎరువులు ఎటు పోయాయే ఎవరికీ తెలియదు. దళిత బంధు కూడా అంతే. చెప్పేది కొండ అంత...చేసేది మాత్రం గోరంత. ఎప్పుడు ఎన్నికల సీజన్ వస్తుండటంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రజలపై అకస్మాత్తుగా ఎన్నికల ప్రేమ పుట్టుకొస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ లోని సర్పంచులను రకరకాలుగా వేధించి..అసలు మీకు ఇవ్వాల్సిన బకాయిలే లేవని బుకాయించి ఎన్నికల్లో ఇది కొంప ముంచే అవకాశం ఉంది అని భయపడి ఇప్పుడు ఆగమేఘాల మీద గ్రామపంచాయతీలకు 1190 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో బీసి చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సడన్ గా ఈ బీసీ లపై ప్రేమ పుట్టుకురావటానికి కారణం కూడా ఎన్నికలే అన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు పలు జిలాల్లో కూడా భూములు అమ్మకానికి పెట్టిన సర్కారు ఇప్పుడు మాత్రం నివాసయోగ్య భూములు గుర్తించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఇది కూడా ఎన్నికల ప్రేమ తప్ప మరొకటి కాదు అని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్నో సార్లు అసెంబ్లీ లో ...బయట కూడా కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ప్రకటించిన కెసిఆర్ సరిగా ఎన్నికల ముందు ఈ తంతు పూర్తి చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్లాన్ వేస్తున్నారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో చెప్పిన సంఖ్యకు...పూర్తి చేసిన వాటి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. చాలా చోట్ల కట్టిన వాటిని కూడా లబ్దిదారులకు ఇవ్వకుండా అలా పెట్టి ఉంచారు. ఎన్నికల ముందు వాటిని పేదలకు అందచేస్తారు. జీహెచ్ ఎంసీ లోనూ ఎన్నికల సమయంలోనే వాటిని పేదలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఇవి అన్ని చూస్తుంటే సీఎం కెసిఆర్ ఏమైనా పనులు చేయాలంటే ఎన్నికలు ఉండాలి...లేదంటే పాత హామీలు అంతే...లేక పోతే కెసిఆర్ ఏ వర్గాన్ని పెద్దగా పట్టించుకోరు అని బిఆర్ఎస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇవే కాదు వచ్చే ఆరు నెలల్లో కెసిఆర్ ప్రజలకు ఇంకా ఎన్ని హామీలు ఇస్తారో...ఎన్ని సినిమాలు చూపిస్తారో వెండి తెరమీదే చూడాలని ఒక నేత వ్యాఖ్యానించారు. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కెసిఆర్ హామీలను ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు అని చెపుతున్నారు. టిఎస్ పీఎస్ సి పేపర్ లీక్ లతో కెసిఆర్ సర్కారు ప్రతిష్ట మసక బారిన విషయం తెలిసిందే. మళ్ళీ ఏదో హడావుడి చేస్తున్న ఎన్నికల లోపు ఈ నియామకాలు ఏవి కూడా భర్తీ అయ్యే అవసరంలేదు అని చెపుతున్నారు. ఇది కచ్చితంగా బిఆర్ఎస్ సర్కారుకు పెద్ద సవాలుగా మారటం ఖాయం అని చెపుతున్నారు.

Next Story
Share it