Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ అధినేతలో అంత భయం ఉందా?

బిఆర్ఎస్ అధినేతలో అంత భయం ఉందా?
X

బిఆర్ఎస్ అధినేతలో అంత భయం ఉందా?

పల్లా కూడా స్పెషలే!

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేయటమే ప్రజల్లో పలు అనుమానాలకు కారణం అయింది. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కోరారు కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నారు అని పార్టీ నాయకులు...రెండు చోట్ల పోటీ పై పార్టీ నిర్ణయం తీసుకుంది అని సీఎం కెసిఆర్ మీడియా సమావేశంలో చెప్పుకున్నా కూడా దీనిపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయి. బిఆర్ఎస్ లో పార్టీ అంటే ఎవరో అందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అయితే గజ్వేల్ లో ఓటమి తప్పదనే కామారెడ్డి లో కూడా పోటీ చేస్తున్నారు అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాసేపు ఈ సంగతి పక్కన పెడితే గురువారం నాడు బిఆర్ఎస్ తొలి విడతలో 54 నియోజకవర్గాలకు ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జ్ లను నియమించింది. ఈ జాబితాలో ముగ్గురు ఇంచార్జిలను పెట్టింది కేవలం మూడు నియాజక వర్గాలకు మాత్రమే. అందులో రెండు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పోటీ చేయబోతున్న నియోజకవర్గాలు. ఒకటి కామారెడ్డి, మరొకటి గజ్వేల్. కామారెడ్డి బాధ్యతలు ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తో పాటు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ను ఇంచార్జి గా పెట్టారు.

కెసిఆర్ బరిలో నిలిచే మరో నియోజకవర్గం గజ్వేల్ లు బాధ్యతలు మంత్రి హరీష్ రావు తో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి కి అప్పగించారు. తొలి జాబితాలో కెసిఆర్ తన నియోజకవర్గం అంత ఫోకస్ పెట్టిన మరో నియోజకవర్గం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బరిలో నిలవనున్న జనగామ నియోజకవర్గం ఉంది. ఇక్కడ ప్రచార ఇంచార్జి బాధ్యతలు మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్సీ బి. వెంకటేశ్వర్లు, డాక్టర్ రాజయ్యలకు అప్పగించారు. జాబితాలోని 54 నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరు ఇంచార్జిలు ఉన్నదే నాలుగు నియోజకవర్గాల్లో. కానీ సీఎం పోటీ చేసే రెండు చోట్ల ఏకంగా ముగ్గురికి బాధ్యతలు ఇవ్వటంతో కెసిఆర్ అంత భయంతో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ తన సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులు పారించి...ఎంతో అభివృద్ధి చేసానని చెప్పుకుంటూ కూడా ఇతర అభ్యర్థుల కంటే తన సొంత స్థానాలపై అంత ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it