Telugu Gateway
Telangana

విద్యుత్ వ్యవహారం బిఆర్ఎస్ కు షాక్ ఇస్తుందా?!

విద్యుత్ వ్యవహారం బిఆర్ఎస్ కు షాక్ ఇస్తుందా?!
X

కడుపు కట్టుకుని..తినీ తినక తెలంగాణ కోసం అహోరాత్రులు కష్టపడి పని చేసిన బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ ఇప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నారు. సిబిఐ, ఈడీ ఎలాంటి విచారణలు చేసినా తమను ఏమి చేయలేవు అని సవాళ్లు విసిరిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనకు ఏ మాత్రం భయం లేదు అని..ఎందుకంటే తాను అసలు ఎలాంటి తప్పులు చేయలేదు అని కెసిఆర్ గతంలో బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ అంశంపై ఆయినా కోర్టు ను ఆశ్రయించే హక్కు కెసిఆర్ కు ఉంది. దాన్ని ఎవరూ కాదనరు. కెసిఆర్ హయాంలో ఛత్తీస్ గడ్ విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్ట్ లో అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై రేవంత్ రెడ్డి సర్కారు విచారణ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కెసిఆర్ ఈ న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహ రెడ్డికి రాసిన లేఖ పెద్ద కలకలమే రేపింది. ఇందులో ఏకంగా ఆరు సార్లు విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహ రెడ్డి ని కెసిఆర్ డిమాండ్ చేశారు. తర్వాత మళ్ళీ పలు అంశాలపై వివరణ కోరుతూ కమిషన్ కెసిఆర్ కు మరో లేఖ రాసింది.

ఈ తరుణంలో కెసిఆర్ ఈ విచారణ నిష్పాక్షికతపై అనుమానాలు ఉన్నాయని...ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీఓ ను రద్దు చేయాలని కోరుతూ హై కోర్టు లో కెసిఆర్ పిటీషన్ వేశారు. అన్ని నిబంధనల ప్రకారమే జరిగాయని చెప్పుకొచ్చారు. మరి అలాంటప్పుడు కెసిఆర్ ఈ విచారణ విషయంలో ఎందుకింత ఆందోళన చెందుతున్నారు అనే ప్రశ్న ఉదయించకమానదు. కమిషన్ కు తాను సమగ్ర వివరాలతో లేఖ రాసినా కూడా కమిషన్ చైర్మన్ గా నరసింహ రెడ్డి కొనసాగటం రాజ్యాంగ విరుద్ధం అని కెసిఆర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఎన్నో సవాళ్లు విసిరిన కెసిఆర్ ఇప్పుడు విచారణ అనగానే లేఖలు రాయటం, కోర్టు లను ఆశ్రయించటంతో ఈ వ్యవహారంలో మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనే చెప్పాలి. మరి హై కోర్టు లో కెసిఆర్ కు ఊరట లభిస్తుందో లేదో కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. బిఆర్ఎస్ హయాంలో ఈ తప్పు జరగకపోతే అటు నరసింహ రెడ్డి కమిషన్ అయినా ఎవరైనా ఏమీ చేయలేరు. అయితే కెసిఆర్ చెపుతున్న మాటలకు బిన్నంగా విద్యుత్ రంగ నిపుణులు కమిషన్ ముందు వాస్తవాలు వెల్లడిస్తున్నారు. అసలు ఛత్తీస్ గడ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఈఆర్ సి తుది అనుమతులు లేవు అని కొంత మంది కమిషన్ ముందు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it