Telugu Gateway
Telangana

మేఘా..బీహెచ్ఈల్ డీల్ రికార్డులు మా ముందు పెట్టండి

మేఘా..బీహెచ్ఈల్ డీల్ రికార్డులు మా ముందు పెట్టండి
X

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కీలక పరిణామం. ఈ ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అవినీతికి సంబంధించి వచ్చిన ఆరోపణలపై ఒరిజినల్ ఫైల్స్ అన్ని తమ ముందు పెట్టాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తో పాటు ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ కు కూడా సుప్రీం కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ అమలు సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దాఖలు అయిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ లు డిసెంబర్ 18 న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్ ల మధ్య జాయింట్ వెంచర్ ఒప్పందం, మేఘా కు సరఫరా చేసిన పరికరాలు..దీనికి చేసిన చెల్లింపుల వివరాలు కూడా కోర్టు ముందు పెట్టాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం మేఘా ఇంజనీరింగ్ బీహెచ్ఈఎల్ తో భాగస్వామ్యంతో పని చేసింది. మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిల్ విచారణలో భాగంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తం 35 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ లో తొలుత ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్ మెంట్ పనులు 5960 కోట్ల రూపాయలతో చేపట్టాలని ప్రతిపాదించారు.

ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ అఫ్ ఇండియా 2015 లో ఈ మేరకు నివేదిక సిద్ధం చేసింది. కానీ తర్వాత మాత్రం ఈ మొత్తం వ్యయాన్ని ఎలాంటి ప్రామాణిక పద్ధతులు పాటించకుండా 8386 కోట్ల రూపాయలు పెంచారు. ఈ అంచనాల పెంపు వల్ల ఖజానాకు 2426 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పిల్ లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పరికరాల సేకరణ కోసం దేశీయ, అంతర్జాతీయ టెండర్లు పిలవకుండా...మేఘా, బీహెచ్ఈఎల్ లు ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీ కి మేలు చేయటం కోసమే ఇలా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. హై కోర్టు లో ఈ పిల్ ను కొట్టేయటంతో నాగం జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.

Next Story
Share it