Telugu Gateway
Telangana

ఫస్ట్ టైం ఐఏఎస్ లతో సెటిల్మెంట్స్ !

ఫస్ట్ టైం ఐఏఎస్ లతో సెటిల్మెంట్స్ !
X

తెలంగాణాలో ఇప్పుడు ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడు కాంట్రాక్టర్లు...పారిశ్రామిక వేత్తలు వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో సర్దుబాట్లు..సెటిల్ మెంట్స్ చేసుకుంటారు. ఇవి అన్నీ కూడా పరస్పర అవసరాలు...ప్రయోజనాల కోణంలోనే ఉంటాయి తప్ప..ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనం ఉండదు అన్న విషయం తెలిసిందే. కొంత మంది ఐఏఎస్ అధికారులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు పూర్తి అనుకూలంగా మారిపోతూ..అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన పనులు అన్నీ చేయటంతో పాటు పనిలో పనిలో సొంత పనులు కూడా చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తొలి పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జమానాలో కొంత మంది ఐఏఎస్ ల జోరుగా మాములుగా సాగలేదు. కనీసం ఒక అరడజను మంది అధికారులు బందిపోట్ల తరహాలోనే దోపిడీకి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కొంత మంది ఐఏఎస్ లపై అయితే పేర్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించింది...తాము అధికారంలోకి వస్తే వాళ్ళ సంగతి తేలుస్తాం అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా చేశారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర ఏడాది కావస్తోంది. కానీ గత ప్రభుత్వ పెద్దలకు పూర్తిగా అండదండలు అందించి పెద్ద ఎత్తున దోచుకున్న ఐఏఎస్ లపై ఇప్పుడు ఈగ కూడా వాలటం లేదు. ఇదే ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ఇదే విషయంపై వాళ్ళు ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేంటి ప్రభుత్వంలోని ‘ముఖ్య’ నేతలకు చెందిన మనుషులు రంగంలోకి దిగి వాళ్ళతో కూడా వందల కోట్ల రూపాయలకు సెటిల్ మెంట్ చేసుకున్నట్లు చెపుతున్నారు. వీళ్ళు ఈ డబ్బులు అన్నీ భూ వ్యవహారాల్లో సంపాదించినవే. అందుకే కొన్ని చోట్ల బినామీ పేర్లతో భూములు కూడా ముఖ్య నేత మనుషులు తీసుకున్నట్లు చెపుతున్నారు.

గతంలో ఎన్నడూ కూడా ఇలా ఐఏఎస్ లు రాజకీయ నాయకులకు కోట్ల రూపాయలు ఇచ్చి సేఫ్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయనే చెప్పొచ్చు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. కాంట్రాక్టర్ లు..వ్యాపారులతో సెటిల్ మెంట్స్ చేసుకున్న తరహాలోనే ఏకంగా ఐఏఎస్ లతో కూడా డీల్స్ కుదుర్చుకుని గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళ విషయంలో మౌనం దాలుస్తున్నట్లు అధికార వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇలా డీల్ సెట్ చేసుకున్న వాళ్లలో ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ లు కూడా కొంత మంది ఉన్నట్లు చెపుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య నేతకు అత్యంత నమ్మకస్తుడుగా ఉన్న వ్యక్తి తెరవెనక ఉంది ఈ లావాదేవీలు అన్నీ పూర్తి చేస్తున్నట్లు చెపుతున్నారు. ఆ ఐఏఎస్ అధికారుల చిట్టా అంతా తమ దగ్గర పెట్టుకుని లెక్కలు సరిచేసుకుటనున్నట్లు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.



Next Story
Share it