Telugu Gateway
Telangana

హయత్ నగర్ కార్పొరేటర్ పై మహిళ దాడి

హయత్ నగర్ కార్పొరేటర్ పై మహిళ దాడి
X

గతంలో ఎన్నడూలేని రీతిలో హైదరాబాద్ ను ముంచెత్తిన వరదలతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. నాలాలు కబ్జాలు చేసి కట్టిన ఇళ్లను నేతలు, అధికారులు ఎవరికి వారు వదిలేయటం వల్లే ఇప్పడు ఈ పరిస్థితి ఎదురైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించేందుకు వెళుతున్న ప్రజా ప్రతినిధులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై స్థానికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చాలా చోట్ల ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తాజాగా హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డిపై పై ఓ మహిళ దాడి చేసింది. ఏకంగా చొక్కా కాలర్ పట్టుకుని నిలదీసింది. ఈ ఘటనతో హతాశుడైన కార్పొరేటర్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు.

ఆందోళన చేస్తున్న కాలనీ వాసులను కార్పొరేటర్ తోపాటు వచ్చిన వారు సర్దిచెప్పారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్‌ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ మండిపడ్డారు.

Next Story
Share it