Telugu Gateway
Telangana

అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పు పట్టిన కేటీఆర్

అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పు పట్టిన కేటీఆర్
X

పుష్ప 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన జోష్ లో ఉన్న అల్లు అర్జున్ కు ఊహించని షాక్ . గురువారం నాడు దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన థాంక్ యు ఇండియా కార్యక్రమంలో పాల్గొని వచ్చారు అల్లు అర్జున్. కానీ ఊహించని రీతిలో హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం నాడు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ హఠాత్ పరిణామంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తో పాటు భార్య స్నేహ రెడ్డి కూడా ఆందోళనకు గురి అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో బన్నీ వాసుతో పాటు అల్లు అర్జున్ సన్నిహితులు ఫోన్లు చేస్తూ కనిపించారు. డిసెంబర్ 4 న హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో వేసిన ప్రీమియర్ షో కు అల్లు అర్జున్ హాజరు అయిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె తనయుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రేవతి భర్త ఫిర్యాదు మేరకు థియేటర్ యాజమాన్యం తో పాటు అల్లు అర్జున్ పై కూడా చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ప్రతినిధులను అరెస్ట్ చేయగా..ఇప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటానికి ఇంటికి వెళ్లిన సమయంలో పోలీస్ ల తీరుపై అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు కూడా మార్చుకోనివ్వరా...బెడ్ రూమ్ లోకి వస్తారా అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ కలకలం రేగింది అనే చెప్పొచ్చు. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ కేసు లో అరెస్ట్ చేస్తారు అని ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే అల్లు అర్జున్ తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలంటూ హై కోర్ట్ లో క్వాష్ పిటిషన్ కూడా వేశారు. ఈ కేసు విచారణకు వచ్చే లోగానే అరెస్ట్ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్ కచ్చితంగా సంచలనం అవుతుంది అనటం లో సందేహం లేదు. ఇలాంటి సెన్సిటివ్ కేసు ల విషయంలో పోలీస్ లు ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టకుండా చేయరు అని..ఇది సీఎం రేవంత్ రెడ్డి కి చెప్పే చేసి ఉంటారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసిన వెంటనే పరిశ్రమకు చెందిన నిర్మాతలు..దర్శకులు హడావుడిగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి కూడా షూటింగ్ రద్దు చేసుకుని మరీ అల్లు అర్జున్ ఉన్న స్టేషన్ కు బయలుదేరారు. అల్లు అర్జున్ అరెస్ట్ అప్పుడే రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అల్లు అర్జున్ ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు అని...పాలకుల అభద్రతా భావానికి బన్నీ అరెస్ట్ నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాద్యుడు కాదు అని..అరెస్ట్ ను ఖండిస్తున్నా అని పేర్కొన్నారు. ఇదే లాజిక్ తో హైడ్రా కారణంగా ఇద్దరి మరణానికి కారణం అయిన సీఎం రేవంత్ రెడ్డి ని కూడా అరెస్ట్ చేయాలి అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు.

Next Story
Share it