.వరద బాధితులకు సాయంపై పవన్ సంచలన వ్యాఖ్యలు
నేతలు 'సొమ్ము బయటకి తీయాలి
రాజకీయాల కోసం పెట్టుబడి అనుకోండి
వరద బాధితులకు సాయం అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే నాయకులు వరద బాధితులను ఆదుకునేందుకు ఆ సొమ్ము బయటకు తీయలేరా? అని ప్రశ్నించారు. రాజకీయాల కోసం పెట్టుబడి అని సొమ్ము బయటకు తీయాలని అన్నారు. వేల కోట్లు సొమ్ము అంతా మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థల వద్దే ఉంటుంది. నేతలు, వ్యాపారులతో పోలిస్తే సినిమా వాళ్ళ దగ్గర ఉండే సంపద ఎంత? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు అని ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు అన్నది ఆసక్తకరంగా మారింది. విపత్తుల సమయంలో బాదితులను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. సరైన ప్రణాళిక లేకపోవటం, నాలాల ఆక్రమణలే తాజాగా హైదరాబాద్ లో వచ్చిన వరదలకు కారణం అని అభిప్రాయపడ్డారు.
జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగంతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వరదల వల్ల గతంలో లేనంతగా హైదరాబాద్ లో ప్రాణనష్టం జరిగిందని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిబంధనలకు తూట్లు పొడవడం వల్ల జరిగిన నష్టం ఇది. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలాలపై అక్రమ కట్టడాలను తొలగిస్తామని చెప్పారు. కానీ ఎందుకు ముందుకు వెళ్లలేకపోయారో తెలియదు. ఇప్పటికైనా అక్రమ కట్టడాలపై దృష్టి సారించి సాధ్యమైనంత వేగంగా తొలగించాలి. ఇళ్లు కోల్పోయిన వారికి వేరే చోట ప్రత్యమ్నాయ నివాస స్థలం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఆపగలం అన్నారు.
అందరి ఉమ్మడి డబ్బు అయిన ప్రభుత్వ ఖజానాలోని నిధులను ఇష్టారాజ్యంగా కాకుండా ఇలాంటి విపత్తుల సమయంలో నిజమైన బాధితులకు అందేలా చూడాలి. సినిమా రంగంలోనివారికి పేరేమో ఆకాశానికి ఉంటుంది కానీ డబ్బు ఆ స్థాయిలో ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలా ఇక్కడ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండదు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు వందల కోట్లు ఖర్చు చేస్తారు. ఆ స్థాయి డబ్బులు ఇక్కడ ఉండవన్నారు. నిజానికి సంపద అంతా- రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర, ఎలక్షన్ సమయంలో వందలకోట్లు ఖర్చు చేసిన రాజకీయ నాయకుల దగ్గర, వేల కోట్లు ఖర్చు పెట్టగలిగే రాజకీయ వ్యవస్థల దగ్గర, వేలకోట్లు విలువైన ఎగుమతుల వ్యాపారాలు చేసే పారిశ్రామికవేత్తల దగ్గర, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉండే సంస్థలు, కాంట్రాక్టర్ల దగ్గర ఉంది. వాళ్లతో పోల్చితే సినిమా పరిశ్రమ చాలా చిన్నదన్నారు.