Telugu Gateway
Politics

అక్రమ నిర్మాణాలపై అప్పుడొక మాట..ఇప్పుడొక మాట

అక్రమ నిర్మాణాలపై అప్పుడొక మాట..ఇప్పుడొక మాట
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తెలంగాణ కు చెందిన పలు అంశాలపై మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో ఆయన ఈ ప్రాంత సమస్యలపై, రాజకీయాలపై పెద్దగాస్పందించిన దాఖలాలు లేవు. నాలాలు, చెరువుల దురాక్రమణపై ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాట్లాడినంత బలంగా అధికార పక్షంలోకి రాగానే మాట్లాడలేకపోతున్నారు. సన్నాయినొక్కులు నొక్కుతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వాటర్ బాడీస్ ను పరిరక్షించే జీవో 111కు తూట్లు పొడిచే ప్రయత్నాల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు అని తెలిపారు. అర్బన్ ప్లానింగ్, జీవో 111 అమలు ఆవశ్యకత, అర్బన్ ప్లానింగ్ నిబంధనలు అమలులో నేతల జోక్యం తదితర అంశాలపై పవన్ స్పందించారు. జీవో 111 తీసుకువచ్చిందే వాటర్ బాడీస్ ను పరిరక్షించేందుకే. పరీవాహక ప్రాంతాల నుంచి జల ప్రవాహం ఆగకూడదనే ఉద్దేశంతో ఆ ఉత్తర్వు తెచ్చారు. దీనికి 2009 నుంచి తూట్లు పొడవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలాలూ... ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో ఉన్న స్థలాలు ఆక్రమించేయడం, ఇళ్ల నిర్మాణం చేపట్టడం.. అనుమతులు ఇచ్చేయడం చేస్తున్నారు. మళ్ళీ వాటిని కొంత డబ్బు కట్టించేసుకొని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. తప్పు చేసేయవచ్చు... ఆ తరవాత డబ్బు కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి అనే ధోరణే ఇప్పటి పరిస్థితికి దారి తీసింది. ఇందుకు ఈ ప్రభుత్వాన్నే అనలేంగానీ గత ప్రభుత్వాల నుంచి తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి ఆ తప్పులను సరిచేసే బాధ్యత ఉంది. ఈ విషయంలో ఎంత వరకూ సఫలీకృతులు అవుతారో తెలీదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేయాల్సింది జీవో 111 అమలుపై దృష్టిపెట్టాలి. లేకపోతే ఇవాళ జరిగిన నష్టం మరో 20 ఏళ్ల తర్వాత ఇబ్బంది ముబ్బడిగా జరుగుతుందన్నారు. సిటీ ప్లానింగ్ లో అక్రమాలకు తావివ్వకూడదు అనేది ఒక కామన్ మినిమమ్ ప్రోగ్రాం కావాలి. అధికారులు కూడా టౌన్ ప్లానింగ్ విషయంలో చాలా స్పష్టతతో వ్యవహరించాలి. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించకూడదు.

నివాసాల కోసం ఉద్దేశించిన ప్రాంతంలో కమర్షియల్ బిల్డింగులు కట్టకూడదని ఉంటుంది. కానీ కడతారు. అధికారులు వెళ్లి అడిగితే ఎంపీ తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అంటుంటారు. ఫలానా నాయకుడు మా బంధువు అనో, మా మేనమామ అనో చెబుతారు. ఎవరినీ ఉపేక్షించకూడదు. ప్రతి ఒక్కరికి చట్టపరమైన నిబంధనలను సమానంగా వర్తించేలా చేయాలి... అది 50 చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు ఐదు లక్షల చదరపు అడుగుల నిర్మాణం కావచ్చు. ముఖ్యంగా అధికారులు తమ నిర్ణయాలను భయపడకుండా బలంగా అమలు చేయాలి. ఫలానా వారికోసమో, మరొకరి కోసమో తూట్లు పొడవకూడదు. ప్రజా ప్రతినిధులు అక్రమాలను వెనకేసుకొని రాకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉంటారు,. వెళ్లిపోతారు. వ్యవస్థలను బలోపేతం చేసి వెళ్లాలి. వ్యవస్థను తూట్లు పొడిచి వెళ్లిపోతే వచ్చే సమస్య ఇది అన్నారు.

Next Story
Share it