పుల్వామా దాడి మా పనే
పాక్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. అది కూడా జాతీయ అసెంబ్లీ సా క్షిగా. జమ్మూకాశ్మీర్ లో పుల్వామా దాడికి తామే కారణం అని, ఇది పాక్ ప్రజల విజయం అని ఆ దేశ మంత్రి పవద్ చౌదురి గురువారం నాడు వ్యాఖ్యానించారు. 2019 ఫిబ్రవరి 14న కాశ్మీర్‌లోని పుల్వామాలో చోటుచేసుకున్న విధ్వంసం వెనుక ఉన్నది తామేనని చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో సాధించిన గొప్ప విజయమని పేర్కొన్నారు. భారత్‌ను సొంతగడ్డపైనే దెబ్బతీశామని, ఇమ్రాన్ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. పుల్వామా ఉగ్రదాడికి భారత్‌కు చెందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్‌లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్టు తొలుత ప్రకటించుకుంది. అయితే అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత నిఘా వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. తాజాగా పాక్ మంత్రి ప్రకటనతో.. భారత్ అనుమానం నిజమైంది. ఈ నేపథ్యంలో దాయాది దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ వ్యవహారంలో పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా వణికినట్లు పాకిస్థాన్ ప్రతిపక్ష ఎంపీ అయాజ్ సాధిక్ వ్యాఖ్యానించారు. దీంతో పుల్వామా ఘటనను ఫవద్ ప్రస్తావించి కీలక విషయాలు వెల్లడించారు.