Telugu Gateway
Politics

మోడీ చైనా..పాక్ లతో యుద్ధ తేదీలు నిర్ణయించారు

మోడీ  చైనా..పాక్ లతో యుద్ధ తేదీలు నిర్ణయించారు
X

ఉత్తరప్రదేశ్ బిజెపి ప్రెసిడెంట్ స్వతంత్రదేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్ లతో ఎప్పుడు యుద్దం చేయాలో ప్రధాని మోడీ తేదీలు నిర్ణయించారన్నారు. అంతే కాదు..సమాజ్ వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలను టెర్రరిస్టులతో పోల్చారు. సింగ్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి మోడీ ఎలా ప్రణాళిక సిద్ధం చేశారో...జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు ఎలా చేశారో...అలాగే పాకిస్తాన్, చైనాలతో యుద్ధం ఎప్పుడో కూడా తేదీలు నిర్ణయం అయ్యాయన్నారు. ప్రతి దానికి మోడీ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలను యూపీ బిజెపి నేతలు సమర్ధిస్తున్నారు. ఎంపీ రవీంద్ర కుష్వాహ ఈ వివాదస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకే ఈ ప్రకటన చేశారని వ్యాఖ్యానించారు. లడ్డాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద గత కొంత కాలంగా భారత్ -చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు దేశాల మధ్య పలు దఫాలు చర్చలు సాగినా ఎలాంటి పురోగతి కన్పించలేదు.

Next Story
Share it