Telugu Gateway
Politics

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పుడు కష్టం

ఏపీలో స్థానిక ఎన్నికలు ఇప్పుడు కష్టం
X

ఏపీ సర్కారు తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించటానికి రెడీ అయింది. ఈ సమయంలో అధికార వైసీపీ తన వైఖరిని తేల్చిచెప్పింది. టీడీపీ మాత్రం ఎన్నికలకు రెడీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఏంటి అని టీడీపీ ప్రశ్నిస్తోంది. వైసీపీ వాదన అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థలను నిర్వహించే యోచనలేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు ఉన్నాయని, దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గినా కేసులు మాత్రం వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మార్చి నెలలో వాయిదా పడ్డ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే వాతావరణం లేదని సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వం ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించటానికి ఏ మాత్రం ఆసక్తిగాలేదనే విషయం బహిరంగ రహస్యం. ఎందుకంటే ఎస్ఈసీ, సర్కారు మధ్య వివాదం ఆ స్థాయిలో సాగింది. ఇప్పటికీ పలు కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. మరి అన్ని పార్టీలతో నిర్వహించే సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it