ఇండియా 'మురికి దేశం'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం కరోనాపై భారత్ దొంగ లెక్కలు చెబుతోందంటూ వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన తుది ప్రెసిడెన్షియల్ డిబేట్ లో భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'భారత్ మురికి..ఆ దేశంలో గాలి మురికి' అంటూ వ్యాఖ్యానించారు. చైనాను, రష్యాలను చూడండి ఆ దేశాల్లో గాలి అంతా కాలుష్యం అంటూ విమర్శలు గుప్పించారు. తాను పర్యావరణాన్ని ఎంతో ప్రేమిస్తానని తెలిపారు. అమెరికాలో ఎంతో శుభ్రమైన గాలి, శుభ్రమైన నీరు ఉందని అన్నారు. అమెరికాలో కర్భన ఉద్ఘారాలు అతి తక్కువ అని తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తుది డిబేట్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ రెడీగా ఉందని..కొన్ని వారాల్లో నే ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ కోసం మిలటరీకి అందజేస్తామన్నారు. డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ మాట్లాడుతూ ట్రంప్ కు కరోనా మహమ్మారి ని ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళిక లేదని ఆరోపించారు. ఎన్నికల తేదీ నవంబర్ 3 దగ్గరకు వస్తుండటంతో ప్రచారం ఊపందుకుంది.
ఈ ముఖాముఖి సందర్భంగా జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో కలుగజేసుకునే దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ''నేను స్పష్టంగా చెబుతున్నాను. అమెరికా ఎన్నికల విషయంలో కలుగజేసుకునే ఏ దేశమైనా కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటివరకు నేను ఏ దేశం నుంచి కూడా ఒక్క పెన్ను కూడా తీసుకోలేదు. రష్యా, చైనా సహా అనేక దేశాల్లో ట్రంప్‌కు వ్యాపారాలు ఉన్నాయి. రష్యా, చైనా నుంచి ట్రంప్‌కు భారీగా ఆర్థిక సాయం అందుతోంది. చైనాలో ట్రంప్‌కు రహస్య ఖాతాలు ఉన్నాయ''ని ఆరోపించారు. ట్రంప్ దీనికి కౌంటర్ గా ఆరోపణలు చేశారు. ''రష్యా నుంచి బైడన్‌కు మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందుతోంది. కరోనాకు కారణం చైనానే. అమెరికాలో కరోనా మరణాల రేటు తగ్గింది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల్లో అమెరికా ముందంజలో ఉందని అన్నారు.