Telugu Gateway
Politics

భారత్ పై మరోసారి ట్రంప్ విమర్శలు

భారత్ పై మరోసారి ట్రంప్ విమర్శలు
X

ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విమర్శలు చేశారు. తాజాగా వెల్లడైన సర్వేలో మెజారిటీ ఇండియన్ అమెరికన్స్ డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ కు అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్ కొద్ది రోజుల క్రితం కూడా భారత్ పై కరోనాకు సంబంధించి తీవ్ర విమర్శలు చేశారు. కరోనా విషయంలో భారత్ వాస్తవ లెక్కలు చెప్పటం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి భారత్ పై విమర్శలు గుప్పించారు. అమెరికాలో అధ్యక్ష అభ్యర్ధుల గెలుపు ఓటములను నిర్ణయించే రాష్ట్రాలలో ఒకటైన నార్త్ కరోలినా‌లో గురువారం రోజు ట్రంప్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వాతావరణ కాలుష్యానికి భారత్, చైనా, రష్యా దేశాలే కారణమన్నారు. ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలను తీవ్ర స్థాయిలో గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో పర్యావరణం దెబ్బతింటోందని ఆరోపించారు. వాతావరణ మార్పులకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటుందని ప్రకటించి ట్రంప్ కలకలం రేపారు. అగ్రరాజ్యాలు తమ అవసరాలు అన్నీ తీర్చుకుంటూ కాలుష్యాన్ని ప్రపంచంపైకి వదిలేస్తూ..అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాయి.

దీనిపై ఎప్పటినుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ట్రంప్ అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తూ ప్యారిస్ ఒప్పందం తమకు అమోదయోగ్యం కాదంటూ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు భారత్ తోపాటు ఇతర దేశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ తాము పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అందుకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. 'మీకు నేనెప్పుడూ చెబుతూనే ఉంటాను. మీకు కూడా తెలుసు. నాకు స్వచ్ఛమైన గాలి అంటే ఇష్టం. కానీ రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మీ సలహా ఏంటో చెప్పండి' అంటూ తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ప్లాస్టిక్ బదులుగా పేపర్‌ను వాడాలనే సూచనను ఆయన ఎద్దేవా చేశారు.

Next Story
Share it