మరో వివాదంలో ట్రంప్..ఫేక్ మెలానియా!
ఫేక్ మెలానియా. ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న అంశం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆయన అమ్మాయిల విషయంలోనూ గతంలో పలుమార్లు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అధ్యక్షుడు కాకముందు తమతో అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఇది అంతా పాత గొడవ. ఎన్నికల వేళ ఇప్పుడు ఓ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అదేంటి అంటే ట్రంప్ తన హెలికాప్టర్ లో భార్య మెలానియాను కాకుండా ఆమెలా ఉన్న మరో మహిళను వెంటపెట్టుకుని తీసుకెళ్ళినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు ఫేక్ మెలానియా, మెలానియా అంటూ ఇద్దరి ఫోటోలను పోల్చుతూ కూడా ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఎన్నికల వేళ అమెరికన్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కోవటం కలకలం రేపుతోంది. మెలానియా డూప్ ను వెంటపెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అజ్ఞాత మహిళకు సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్ లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది. ఎయిర్ క్రాఫ్ట్ లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ 'ఫేక్ మెలానియా' హ్యాష్‌ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తు తెలియని మహిళను తన భార్యగా ప్రపంచానికి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.