Telugu Gateway
Politics

బండి సంజయ్ అరెస్ట్..దీక్ష ప్రారంభం

బండి సంజయ్ అరెస్ట్..దీక్ష ప్రారంభం
X

దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం మరింత వేడేక్కుతోంది. సోమవారం నాడు పరిణామాలు చకచకా సాగాయి. సిద్ధిపేటలో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు బంధువుల ఇళ్ళలో 18 లక్షల రూపాయలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు, బిజెపి కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేట బయలుదేరారు. మార్గమధ్యంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. రఘునందన్‌రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడి చేయడం, సోదాలు నిర్వహించడం అప్రజాస్వామికమని బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. ఈ అనైతిక దాడులను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

దుబ్బాక శాసనసభకు ఎన్నిక జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా డబ్బులు లాక్కెళ్లిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సిద్ధిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్ డేవిడ్ మాట్లాడుతూ నగదు దొంగిలించినవారిని గుర్తించి త్వరలోనే అరెస్ట్‌ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బిజెపి నాయకులపైన పోలీసు చర్యలు పలు సందేహాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ దీక్ష ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ దీక్షలో కూర్చున్నారు.

Next Story
Share it