Telugu Gateway
Politics

నిమ్మగడ్డ లో చంద్రబాబు పరకాయ ప్రవేశం

నిమ్మగడ్డ లో చంద్రబాబు పరకాయ ప్రవేశం
X

అధికార వైసీపీ మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాజకీయ పార్టీలు అన్నింటిని ఒకేసారి కూర్చోపెట్టి కాకుండా ఇలా రహస్య సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏముందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. అదేమంటే కరోనా అని చెబుతున్నారని, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ..మాస్క్ లు పెట్టుకుని కేబినెట్ సమావేశాలే జరుగుతున్నాయని అలాంటిది..పార్టీల సమావేశం ఒక గదిలో పెట్టలేరా?అని ప్రశ్నించారు. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి సమావేశం పెట్టలేని రమేష్ కుమార్ మరి కరోనా సమయంలో ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నించారు. వన్ టూ వన్ అని చెప్పి రహస్య మంతనాలు జరిపారని ఆరోపించారు. రమేష్ కుమార్ ఎంత చట్టబద్ధంగా..ధర్మబద్ధంగా వ్యవహరిస్తారో అందరికీ తెలుసున్నారు. హైదరాబాద్ లో చీకట్లో స్టార్ హోటల్ సమావేశాలు ఎవరూ మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.

ఆయన చట్టబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామంటే మేం నమ్మాలా అని అడుగుతున్నా అంటూ ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ లో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేశారని ఆరోపించారు. కరోనా ఉంది అని ఎన్నికలు వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా తగ్గిందా పెరిగిందా అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా ఇచ్చిన సలహాలు కూడా మీరిచ్చినవే అయి ఉంటాయని ఆరోపించారు. తెలుగుదేశం మీరు కుమ్మక్కు అయి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుందా?. ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించండి. చట్టబద్ధంగా వ్యవహరించండి..ధర్మబద్దంగా వ్యవహరించండి.చంద్రబాబు జేబు సంస్థగా వ్యవహరించొద్దని అంబటి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు చెప్పిన వారినే జడ్పీ ఛైర్మన్లు, ఎంపీపీలుగా నామినేట్ చేస్తే సరిపోతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది తామేనని..ఎన్నికలకు భయపడే ప్రశ్నేలేదన్నారు. రమేష్ కుమార్ గిల్లి..గెలికి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఆయన చర్యలు చూసి దేశంలో..రాష్ట్రంలో ప్రజలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కుట్రలో భాగంగానే సమావేశం పెట్టారన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకునేలా రమేష్ కుమార్ పనిచేస్తున్నారని తెలిపారు. అధికారమే పోయి..23 సీట్లకు వచ్చి అందులో నలుగురు మళ్ళీ వెళ్లిపోయిన టీడీపీకి ఏమి ఉంది అని భయపడాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది వైసీపీనే అని అంబటి ధీమా వ్యక్తం చేశారు. అసలు పోవటానికి ..భయపడటానికి టీడీపీ దగ్గర ఏమి ఉందని..ప్రజలు బట్టలు కూడా ఊడదీసి వదిలారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it