Telugu Gateway
Politics

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీఆర్ఎస్ విమ‌ర్శ‌లు
X

కొద్ది రోజుల క్రితం తెలంగాణ మంత్రి కెటీఆర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఒకరిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కురిపించుకున్నారు. ఓ విష‌యంలో ప‌వన్ కళ్యాణ్ మంత్రి కెటీఆర్ ను స‌ర్ అని సంభోదిస్తే..అది స‌రికాద‌ని త‌మ్ముడు అని పిల‌వాల‌న్నారు. అంతే కాదు ఓ సారి కెసీఆర్ త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఎది‌రేగి స్వాగ‌తం ప‌లికారు. ఇది చూసిన వారు కూడా ఆ రోజు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదంతా పాత క‌థ‌. ఇప్పుడు సీన్ మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార టీఆర్ఎస్ టార్గెట్ అయ్యారు. దీనికి కార‌ణం హోరాహోరిగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన బిజెపికి మ‌ద్ద‌తు ఇవ్వ‌ట‌మే. అందుకే టీఆర్ఎస్ నేత‌లు ప‌వ‌న్ పై విమ‌ర్శ‌లు ప్రారంభించారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై కూడా బాల్క సుమన్‌ సెటైర్లు వేశారు. 'పక్క రాష్ట్రంలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగుతాననడం హాస్యాస్పదం. ఆయనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయనతో లేడు. అలాంటి పార్టీని, వ్యక్తిని బీజేపీ కలుపుకోవడం​విడ్డూరం. పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడు..?. విస్తృత ప్రయోజనాల కోసం పోటీచేయట్లేదంట.. ఈ మాటలు వింటుంటే జనాలు నవ్వుకుంటున్నారు' అంటూ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ప్రతిపక్ష పార్టీల్లో టికెట్ల లొల్లి ఒడవట్లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఆయ‌న శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'అభ్యర్థులను ప్రకటించడంలో టీఆర్‌ఎస్‌ ముందుంది. ఇవాళ్టి నుంచి కేటీఆర్‌ రోడ్‌ షోలు ఉంటాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నిలకను ప్రశాంతంగా నిర్వహిస్తోంది. రేపు హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉంచే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మా అభ్యర్థుల్లో 50 శాతం విద్యావంతులు, 50 శాతం యువకులు ఉన్నారు. 70 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది. టికెట్ల కేటాయింపులో టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయం పాటించింది. బీజేపీలో గెలిచిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి ఏం చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డ్‌ వచ్చిందా? బీజేపీ, కాంగ్రెస్‌కు గ్రేటర్‌ ప్రజలు తగిన బుద్ది చెప్తారు. కిషన్‌రెడ్డి నిస్సహాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నార‌ని విమ‌ర్శించారు.

Next Story
Share it