ఈటెలది ఆస్తుల మీద గౌరవం..ఆత్మగౌరవం కాదు
టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై అధికార టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. ఐదేళ్ల క్రితమే ప్రగతి భవన్ లోకి రానివ్వకపోతే..అప్పుడు రాజీనామా చేయకుండా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు చెబుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఈటెలది ఆస్తుల మీద గౌరవం తప్ప..ఆత్మగౌరవం కాదని ఎద్దేవా చేశారు. ఈటెల ఆస్తులు కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవటానికే ఆత్మగౌరవ నినాదం అందుకున్నారని విమర్శించారు. ఈటెల వెనక ఆత్మగౌరవవాదులు ఎవరూ లేరన్నారు. రైతుల మీద ఉక్కుపాదం మోపిన బిజెపిలో ఎలా చేరతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీలో ఉన్నంత కాలం దేవుడు అని ఇప్పుడు దెయ్యం, నియంత అంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. కెసీఆర్ తర్వాత ఎక్కువ పదవులు పొందింది ఈటెల మాత్రమే అన్నారు. ఈటెల వైఖరి తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందని మండిపడ్డారు. అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈటెల తన ఓటమిని ముందే ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
చట్టవిరుద్ధంగా అసైన్ మెంట్ భూములు కొన్నవారిపై చర్యలు తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. బిజెపిలో చేరబోతున్న ఆయనకు అభినందనలు చెబుతున్నామని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. దేశాన్ని ఉద్దరిస్తున్న..కరోనాను బాగా కట్టడి చేస్తున్న పార్టీలో చేరుతున్న ఆయనకు శుభాకాంజ్ఞలు తెలుపుతున్నామన్నారు. చట్టవిరుద్ధంగా అసైన్ మెంట్ భూములు కొనకూడదని ఈటెల రాజేందర్ కు తెలియదా అని ప్రశ్నించారు. తమకు ముఖ్యమంత్రి కెసీఆర్ కావాల్సినప్పుడు సమయం ఇస్తున్నారని తెలిపారు. బలహీన వర్గాలకు కెసీఆర్ న్యాయం చేస్తున్నారని తెలిపారు.