Telugu Gateway
Politics

ముఖ్యమంత్రి పైకి రాళ్ళు..ఉల్లిపాయలు

ముఖ్యమంత్రి పైకి రాళ్ళు..ఉల్లిపాయలు
X

ఎన్నికల ప్రచార సభలో ఊహించని పరిణామం. ఏకంగా ముఖ్యమంత్రి పైకే సమావేశానికి హాజరైన వారు రాళ్లు..ఉల్లిపాయలు విసిరారు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి బీహార్ సీఎం నితీష్ కుమార్ కు రక్షణగా నిలిచారు. ఈ ఘటనతో ఆయనకు కోపం నషాళానికి ఎక్కింది. కోపంతో ఊగిపోయారు. హోరాహోరీగా సాగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. నితీష్ కుమార్ మంగళవారం నాడు మధుబన్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

ఈ సమావేశంలోనే యువకులు ఉల్లిపాయలు, రాళ్ళు విసిరేశారు. అంతే కాదు నితీష్ కుమార్‌ ఫెయిల్యూర్‌ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ప్రచారంలో సీఎం ఉద్యోగాల విషయం గురించి మాట్లాడగానే ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో స్టేజ్‌ మీద ఉన్నప్పుడే నితీష్ ఆగ్రహంతో ఊగిపోతూ ఇంకా విసరండి అంటూ పదే పదే అన్నారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారిని ఏం చేయొద్దని క్షమించి వదిలేయాలని నితీష్ సూచించారు.

Next Story
Share it