సోనియా సేన..పప్పూ సేన
మహారాష్ట్రలోని శివసేన సర్కారుపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి మండిపడింది. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణాబ్ గోస్వామి అరెస్ట్ వ్యవహారంపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీరు ఎంత మంది గొంతులు కోస్తారు..ఎన్ని గళాలను అణిచివేస్తారు. ఎంత మందిని జుట్టు పట్టుకుని అవమానిస్తారు. మీరు ఇలా చేసే కొద్దీ మీకు వ్యతిరేకంగా గళాలు పెరుగుతూనే ఉంటాయి. తమ భావాలను స్వేచ్చగా బహిర్గతం చేసిన చాలామందిని ఉరితీశారు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని పప్పు సేన, సోనియా సేన అనటంలో తప్పు ఎలా అవుతుంది' అని ప్రశ్నించారు. అర్ణాబ్ అరెస్ట్ అనంతరం కంగనా రనౌత్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఓ కేసులో రాయగడ్, ముంబయ్ పోలీసులు బుధవారం ఉదయమే అర్ణాబ్ ను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంబయ్ లో జరిగిన అర్ణాబ్ అరెస్ట్ ఎమర్జెన్సీని తలిపిస్తోందని విమర్శించారు. ఈ అరెస్ట్ వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ చట్టప్రకారమే అర్ణాబ్ గోస్వామి అరెస్ట్ జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మీడియాపై ఇలాంటి దాడులే జరుగుతాయని అన్నారు.