శశికళ విడుదల
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామం. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళ బుధవారం నాడు జైలు నుంచి విడుదల అయ్యారు. నాలుగేళ్ల పాటు ఆమె జైలు శిక్ష అనుభవించారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతున్నారు. అవినీతి కేసులో ఆమె జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉండగానే ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. వెంటనే ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో దీనికి సంబంధించిన లాంఛనాలు అన్నీ ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని సమాచారం. శశికళ విడుదలతో తమిళనాడు రాజకీయాల్లో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.