కెటీఆర్ కు ఎందుకు ఉలికిపాటు?
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాజీ ఎండీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో అక్కడకు చేరుకుని రాష్ట్రంలో డ్రగ్స్ ను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులు కేరాఫ్ అడ్రస్ గా మారాయని ఆరోపించారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న పబ్బులపై సీఎం కెసీఆర్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. రాజకీయ నేతలు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను వైట్ చాలెంజ్ విసిరానన్నారు. అందులో భాగంగానే మంత్రి కెటీఆర్, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిని టెస్టుకు శాంపిల్స్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. తాను కూడా టెస్ట్ కు వస్తానని..గన్ పార్కు నుంచి నేరుగా ఉస్మానియా ఆస్పత్రిలో ప్రభుత్వ డాక్టర్లతో నే టెస్ట్ లు చేయించుకుందామన్నారు.తాను వైట్ ఛాలెంజ్ విసరకముందే..కేటీఆర్ తన బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు టెస్టుకు ఇస్తానన్నారని చెప్పారు. యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్ ఛాలెంజ్ చేశానన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరించకుండా తిట్లదండకం అందుకున్నారన్నారు. టెస్టుకు రమ్మంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ఎమ్మెల్యే కాకముందే తాను ఎమ్మెల్సీ గా గెలిచానన్నారు. దేశంలోనే పెద్ద పార్లమెంట్ స్థానానికి ఎంపీనని.. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినన్నారు. రాజకీయ పరంగా కేటీఆర్ తన వెంట్రుకతో సమానమని..కానీ తాను అలా అనని చెప్పారు. ఎందుకంటే కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారన్నారు. నగరంలోని పబ్బుల యజమానులు డ్రగ్స్ అందుబాటులోకి తెస్తున్నారన్నారు. ఎక్సైజ్ శాఖ విచారణలో లేని రానా, రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణలో ఎలా వచ్చారని ప్రశ్నించారు. వీరిని అప్పుడు తప్పించింది ఎవరు ఎవరన్నారు. నిప్పు లేకుండానే పొగ వస్తుందా? ఈడీ వీళ్లను ఎందుకు విచారణకు పిలిచింది అని సందేహం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ ఇష్యూపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశానని..కోర్టు అన్ని శాఖలకు నోటీసులిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా సహకరించటంలేదన్నారు. విచారణ మధ్యలో ఉండగానే అకున్ సబర్వాల్ ను తప్పించారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి వైట్ ఛాలెంజ్ అనేది సమాజానికి మంచిదన్నారు. గన్‌పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ఛాలెంజ్ స్వీకరించి వస్తే కేటీఆర్ స్థాయి మరింత పెరిగేదని తెలిపారు. మా స్థాయి వేరు అని రాజకీయ నేతలు మాట్లాడొద్దని అన్నారు. పెద్ద రాజకీయ నేతలు - చిన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లి మాట్లాడుతారన్నారు. సింగరేణి ఘటన డ్రగ్స్ వల్లనే అయిందని తెలిపారు. ఎన్నికల్లో నిలబడే ప్రతి లీడర్‌కు డ్రగ్ టెస్ట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్ టెస్ట్ తీసుకున్న తరువాతే ఎన్నికల్లో నిలబడే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించాలన్నారు. రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ తొందర పాటులో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ ఇష్యూకు రాహుల్‌కు సంబంధం లేదని - డ్రగ్ ఇష్యూ రాష్ట్రానికి చెందిన సమస్య అని అన్నారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించి యువతకు ఆదర్శంగా నిలవాలని... బండి సంజయ్ - ప్రవీణ్ కుమార్‌కు సవాల్ విసిరారు.