పెగాసెస్ పై కేంద్రం సమాధానం చెప్పి తీరాలి
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వాడాల్సిన పెగాసెస్ స్పైవేర్ ను మోడీ సర్కారు తమ ఫోన్లలోకి జొప్పించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్రం సమాధానం చెప్పి తీరాల్సిందేని డిమాండ్ చేశారు. సమాధానం చెప్సాల్సిన కేంద్రం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల గొంతే నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పైగా తాము సభా కార్యక్రమాలకు అంతరాయం కల్పిస్తున్నట్లు చెబుతున్నారన్నారు. పెగాసెస్ అంశంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు.
పెగాసెస్ స్పైవేర్ ను తన పోన్ తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మరికొంత మంది రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధుల ఫోన్లలో చొప్పించి హ్యాక్ చేశారన్నారు. తాము కేంద్రాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే అని..పెగాసెస్ కొనుగోలు చేశారా?. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉపయోగించారా అని ప్రశ్నించారు. పెగాసెస్ అనేది తన వ్యక్తిగత అంశం కాదు..దేశ భద్రతకు సంబంధించిన అంశమన్నారు. పెగాసెస్ అంశంపై తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.