Top
Telugu Gateway

నియంతల పేర్లు అన్నీ 'ఎం'తోనే

నియంతల పేర్లు అన్నీ ఎంతోనే
X

వైరల్ అవుతున్న రాహుల్ ట్వీట్...కౌంటర్లూ పడుతున్నాయి

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఒకటి దుమారం రేపుతోంది. చాలా మంది నియంతల పేర్లు ఎందుకో 'ఎం'తోనే ప్రారంభం అవుతాయంటూ ఆయన బుధవారం నాడు ట్వీట్ చేశారు. ఇది వెంటనే వైరల్ గా మారింది. రాహుల్ తన జాబితాలో మార్కోస్ ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో పేర్లను రాహుల్ ప్రస్తావించారు. గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్రమోడీ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల ట్రాక్టర్లను ముందుకు రాకుండా చేసేందుకు పలు చోట్ల రహదారులపై మేకులు కొట్టడం, అడ్డంకులు సృష్టించటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తతున్నాయి.

ఓ వైపు ప్రధాని మోడీ చర్చలకు సిద్ధం అని ప్రకటించి..రోడ్లపై ఇనుప మేకులు కొట్టిన ఫోటోలను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దీనికి తోడు రాహుల్ ట్వీట్ వీటికి జత అయింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదాకా, తమ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని ఒకవైపు రైతు సంఘ నేతలు తేల్చి చెబుతున్నారు. రాహుల్ ట్వీట్ బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ట్విటర్‌ వార్‌కి దారి తీసింది. దాదాపు 8వేల మంది రాహుల్ ‌తాజా ట్వీట్‌ను రీట్వీట్‌ చేయగా 34వేలకు పైగా లైకులు వచ్చాయి. కాంగ్రెస్‌ నేత మోతీలాల్‌ నెహ్రూ, మాజీ ప్రధాని మన్మోహన్‌ పేర్లు కూడా 'ఎం' తోనే మొదలవుతాయి కదా అంటూ కొంత మంది రాహుల్ కు కౌంటర్ ఇచ్చారు. అలాగే మమతా బెనర్జీ, మాయావతి పేర్లను ప్రస్తావించారు మరికొందరు.

Next Story
Share it