Telugu Gateway
Politics

టీఆర్ఎస్ నేతల్లా దోచుకోవటం రాదు

టీఆర్ఎస్ నేతల్లా దోచుకోవటం రాదు
X

అధికార టీఆర్ఎస్ పై దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు మండిపడ్డారు. తనకు టీఆర్ఎస్ నేతల్లా దోచుకోవటం రాదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చాక తమ ఆస్తులు అమ్ముకున్నామని, పటాన్ చెరులో ఇల్లు అమ్మినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు దిగజారి తన తల్లిదండ్రులను కూడా రాజకీయాల్లోకి లాగారని మండిపడ్డారు. సానుభూతి కోసం బిజెపి అల్లర్లకు ప్రయత్నం చేస్తోందంటూ మంత్రి కెటీఆర్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది అంతా అసత్య ప్రచారమే అన్నారు. టీఆర్ఎస్ నైతికంగా ఓటమి పాలైనందున ఏమి మాట్లాడాలో తెలియక కెటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో మొదట వ్యక్తిగత విమర్శలు చేసింది టీఆర్ఎస్ పార్టీనేనన్నారు. హైదరాబాద్ లో ఆదివారం నాడు పట్టుబడిన డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

ఒక సంస్థ యాజమాని, మరో సంస్థ యాజమానికి డబ్బు ఇస్తే అది హవాలా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఆ డబ్బు ఏమైనా సిద్ధిపేట, దుబ్బాకకు వచ్చిందా అని ప్రశ్నించారు. సురభి శ్రీనివాసరావు తన బావమరిదేనని, ఆయనకు చెందిన ఎ టు జెడ్ సంస్థకు బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో ఏ కం పెనీ వ్యాపారం చేసుకోవట్లేదా అని ప్రశ్నించారు. తనపై కొత్త కేసులు పెడుతూ తెలంగాణ పోలీసులు స్వామి భక్తి చాటుకుంటున్నారని ..వారికి తన అభినందనలు అని రఘునందన్ వ్యాఖ్యానించారు. తమ ఫోన్ల ట్యాపింగ్ , ఎస్ వోటీ అధికారులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

`

Next Story
Share it