Telugu Gateway
Politics

రాజ్ భవన్ ముందు గొర్రెలతో ధర్నా

రాజ్ భవన్ ముందు గొర్రెలతో ధర్నా
X

కేసు ఒకటే. బిజెపిలో ఉంటే ఓ రూలు. అదే టీఎంసీలో ఉంటే మరో రూలు. ఇదే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే కాదు..దేశంలో కూడా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. మరి ఈ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఊరుకుంటారా?. తనదైన స్టైల్ లో వ్యవహరిస్తున్నారు. టీఎంసీకి గుడ్ బై చెప్పి ఎన్నికల ముందు బిజెపిలో చేరిన సువేందు అధికారి కూడా ఇదే నారదా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. టీఎంసీ నుంచి బిజెపిలో చేరిన ముకుల్ రాయ్ పై ఇదే కేసులో ఉన్నారు. టీఎంసీ నుంచి బిజెపిలో చేరిన వీరిద్దరిని వదిలేసి..మమతా బెనర్జీ కేబినెట్ లో ఉన్న పిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీలను నారదా స్కామ్ లో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గవర్నర్‌ తీరుపై రకరకాల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గవర్నర్‌ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రాజ్‌భవన్‌ ఎదుట గొర్రెలతో నిరసన వ్యక్తం చేశారు. గొర్రెలను తీసుకొచ్చి రాజ్‌భవన్‌ ఉత్తర ద్వారం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. కొద్దిసేపు అనంతరం భద్రతా సిబ్బంది గొర్రెలను వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను గవర్నర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఈ ఘటనపై గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న, ఈరోజు పరిస్థితి ఆందోళనగా మారిందని గవర్నర్‌ తెలిపారు. నిషేధం అమలులో ఉన్న చోట ఇలా ఎలా చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలకత్తా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం రెచ్చగట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే కూడా పోలీసులు ఏం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖ విడుదల చేశారు. అయితే మమతా బెనర్జీ కూడా తమ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు గవర్నర్ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రయత్నిస్తున్నారని..ఆయన్ను తప్పించి కొత్త వారిని గవర్నర్ గా నియమించాలని కోరుతున్నారు. ప్రజాతీర్పును అపహస్యం చేస్తూ గవర్నర్ వ్యవహరిస్తున్నారని మమతా మండిపడుతున్నారు.

Next Story
Share it