అది ప్రగతి భవన్ కాదు...బానిస భవన్
కెసీఆర్ కుట్రలు..డబ్బు..అణచివేతలను నమ్ముకున్నారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రగతి భవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మాట్లాడుతూ ప్రగతి భవన్ ను అది బానిస భవన్ అని అభివర్ణించారు. కెసీఆర్, తనకు గ్యాప్ ఇప్పుడు రాలేదని..ఐదేళ్ళ క్రితమే వచ్చిందని తెలిపారు. నాలాగే హరీష్ రావు ను కూడా చాలాసార్లు అవమానించారు. సొంత కుటుంబం కోసం మాలాంటి వాళ్ళను అణచివేస్తున్నారు.కెసీఆర్ తెలంగాణలోని కార్మిక సంఘాలు అన్నీ తన కంట్రోల్ లో ఉండాలని కోరుకున్నారన్నారు. ఉద్యమ సమయంలో సంఘాలు అన్నీ కావాలి..ఇప్పుడు వద్దా అని ప్రశ్నించారు. కెసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదు. బానిస కంటే అధ్వాన్నంగా ఉన్న మంత్రి పదవి ఎందుకు?. రాష్ట్రంకోసమే ఇన్నాళ్ళు భరించా?. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే రెండు నెలలు కనీసం పట్టించుకోలేదు. బెంజ్ కార్లలో తిరిగేటోళ్లకు రైతుబంధు ఇస్తున్నారు.
ఐకెపి సెంటర్ల ఎత్తివేత విషయంలో కెసిఆర్ తో బాజాప్త విభేదించా. మాట వినని అందర్నీ తొక్కేశారు. ఏ దిక్కు లేని సమయంలో కెసిఆర్ కు అండగా నిలబడ్డాం. మంత్రులకు స్వేచ్చ లేదు. అధికారులు స్వతంత్రంగా పని చేయటం లేదు. వైద్య మంత్రి లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కెసీఆర్ కుట్రలు..డబ్బును, అణచివేతలను నమ్ముకున్నాడు. రైతుబంధు పేదలకు మాత్రమే ఇవ్వాలని చెప్పా. ఉద్యమ నాయకులను గెలిపించిన చరిత్ర కరీంనగర్ జిల్లాకు ఉంది. హుజూరాబాద్ ప్రజలు కుట్రలను చేధిస్తామంటున్నారు.ఈటెల వెంట మీడియా సమావేశంలో ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.