రామమందిరంపై టీఆర్ఎస్ వైఖరి చెప్పాలి
ముఖ్యమంత్రి కెసీఆర్ పై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్య లు చేశారు. అన్ని మాఫియాలకు ప్రగతిభవన్ కేంద్రంగా మారిందని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేస్తే.. ఆయన పల్లకి మోస్తానని అన్నారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో సంజయ్ మాట్లాడారు. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రామమందిర నిర్మాణంపై వారి అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మూడు లక్షల ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం అసత్యాలు చెబుతోందని మండిపడ్దారు.
'కరోనా మహమ్మారిని ముఖ్యమంత్రి కేసీఆర్ చులకనగా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్రం చర్యల వలనే కరోనాను అడ్డుకోగలిగామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను సరైన సమయంలో అమలు చేయకపోవటంతో పేదలు ప్రాణాలు కోల్పోయారు. కబ్జాదారులను కేసీఆర్ ప్రభుత్వం కాపాడుతోంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లను సమర్పించకుండా ప్రభుత్వం తప్పించుకుంటోంది. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. కేంద్రం నిధులతోనే డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నాయ్. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూస్ పథకాన్ని అమలు చేయాలి' అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలు ఉద్యోగులు, పెన్షనర్లు సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావటం ఖాయమని..తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తుల వారిని మోసం చేస్తోందని..అక్రమంగా ఇసుక తరలించేవారిని కాపాడుతోందని ధ్వజమెత్తారు. బిజెపి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. గోల్కోండ కోటపై కాషాయజెండా ఎగరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని బిజెపి శ్రేణులకు పిలుపునిచ్చారు.