Telugu Gateway
Politics

'చంద్రబాబు భజన' వీడియోతో ముగించిన జగన్

చంద్రబాబు భజన వీడియోతో ముగించిన జగన్
X

పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించం

సీడబ్ల్యూసీ ప్రోటోకాల్స్ ప్రకారమే నీటి నిల్వ

మూడేళ్లలో ప్రాజెక్టు సామర్ధ్యం మేరకు పూర్తి నిల్వ

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరం లో జరిగిన అవినీతి గురించి ప్రత్యేకతంగా తాను చెప్పాల్సిన అసవరం లేదని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీనే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారిందన్న విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించటంలేదని స్పష్టం చేశారు. ఎత్తు తగ్గించటం లేదు..నీటి నిల్వ సామర్ధ్యం కూడా తగ్గించబోమని తెలిపారు. సీడబ్ల్యూసీ ప్రొటోకాల్స్ ప్రకారమే ముందుకు సాగుతామని తెలిపారు. అయితే ఆర్అండ్ఆర్ పనులు దశల వారీగా ఎలా చేయబోతున్నదీ వివరించారు. నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతూ పోతూ..ఆర్అండ్ఆర్ కూడా చేస్తామన్నారు.

ఏ దశలో ఎంత వ్యయం అవుతుందో కూడా వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదన్నారు. పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రన్న భజన చేయడం కోసం ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టారని సభలో పేర్కొన్నారు. ప్రజాధనాన్ని ఉపయోగించి చంద్రబాబు ఎలా భజన చేయించున్నారో ఓ వీడియో వేసి చూపించారు. అందులో పోలవరం సందర్శన వచ్చిన కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని చెబుతూ పాటలు పాడతారు.

ఈ వీడియోను చూసి సభలో సీఎం జగన్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాంతో పాటు సభ్యులు అందరూ పడి పడి నవ్వారు. సీఎం జగన్‌ మధ్యలోనే ఆ వీడియోను ఆపించి.. ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని సభకు వివరించారు. ఎట్టి పరిస్థితిల్లో ప్రాజెక్టు ఆపబోమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ 100 అడుగుల వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

Next Story
Share it