Telugu Gateway
Politics

జగన్ కు..నాకూ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి

జగన్ కు..నాకూ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి
X

ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు సీఎం జగన్ కూ, తనకూ ఉంటాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను ఇష్టపడేవారు చంద్రబాబును రాష్ట్ర సరిహద్దులు దాటించాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించి ..ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు దండలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు. సరిగ్గా ఎన్టీఆర్ జయంతి, వర్థంతులకు మాత్రమే భారతరత్న డిమాండ్ చేస్తారని...మహానాడులో తీర్మానం చేసి కాయితం జేబులో పెట్టుకుంటారని విమర్శించారు. తర్వాత ఎక్కడా కూడా ఈ అంశాన్ని ప్రస్తావించరన్నారు. చంద్రబాబుకు మాత్రం ప్రపంచరత్న ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ పై తనతోపాటు అన్ని పార్టీల నాయకులకు అభిమానం ఉందని..ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఢిల్లీలో చక్రాలు తిప్పాను..టైర్లు విప్పాను..అని చెప్పుకునే చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎందుకు భారతరత్న ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎన్టీఆర్ ఆస్తులపై దాడులు చేసినప్పుడు ఆయన ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని..ధైర్యంగా నిలబడే పులి ఎన్టీఆర్ అయితే..చంద్రబాబు నక్క అని...ఆయన ధైర్యం గురించి ఈయన చెప్పాలా? అని ప్రశ్నించారు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీతో సోనియా, రాహుల్ గాంధీతో కలసి తెలంగాణలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు.

అసలు చంద్రబాబు సిగ్గూ, శరం లేదన్నారు. పదవుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని అన్నారు. అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని ధ్వజమెత్తారు. దేవాలయాలపై దాడుల చేసిన వారు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని, చంద్రబాబు ఉడత ఊపులు...బిజెపి ఉడత ఊపులకు ఎవరూ బెదరాల్సిన అవసరం లేదు. చంద్రబాబుతో సహా ఎవరు ఉన్న లోపలవేయాలని మంత్రి కొడాలి నాని డీజీపీని కోరారు. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు అయితే...చంద్రబాబు భూస్థాపితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నిజంగా ఎంతో బలమైన పార్టీ అని..అలాంటి పార్టీ నాశనం చేసే శక్తి దేశంలో ఇద్దరికే ఇద్దరికి ఉందని..అందులో ఒకరు చంద్రబాబు, మరొకరు నారా లోకేష్ అని వ్యాఖ్యానించారు. వీళ్లు తప్ప మరెవరూ అంతటి పార్టీని నాశనం చేయలేరన్నారు.

Next Story
Share it