Telugu Gateway
Politics

సీఎం సిమెంట్ ధ‌ర ఏపీలో ఎక్కువ‌..పొరుగు రాష్ట్రాల్లో త‌క్కువ‌

సీఎం సిమెంట్ ధ‌ర ఏపీలో ఎక్కువ‌..పొరుగు రాష్ట్రాల్లో త‌క్కువ‌
X

వ‌న‌రులు ఏపీవి..ప్ర‌యోజ‌నాలు ప‌క్క రాష్ట్రాల‌కా?

వ‌ర్క్ ఫ్రం హోమ్ సీఎంకు ప్ర‌జ‌లు క‌ష్టాలు తెలియ‌వు

నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు

జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హ‌రాల క‌మిటీ (పీఏసీ) ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గన్ కుటుంబానికి చెందిన సిమెంట్ కంపెనీ రాష్ట్రంలో అధిక ధ‌ర‌ల‌కు సిమెంట్ విక్ర‌యిస్తూ..ప‌క్క రాష్ట్రాల్లో మాత్రం త‌క్కువ ధ‌ర‌కే సిమెంట్ అమ్ముతోంద‌ని ఆరోపించారు. ఏపీలో వ‌న‌రులు వాడుకుని సిమెంట్ త‌యారు చేసి..ఇక్క‌డ ఎక్కువ ధ‌ర‌..ప‌క్క రాష్ట్రాల్లో త‌క్కువ ధ‌ర‌కు ఎలా అమ్ముతార‌ని ప్ర‌శ్నించారు. సీఎం జ‌గ‌న్ కుటుంబానికి చెందిన సిమెంట్ కంపెనీకి నీళ్ళు... భూమి.. వనరులు మన రాష్ట్రానివే అన్నారు. పండ‌గ‌ల స‌మ‌యంలో ఆర్టీసీ బ‌స్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వానికి నిజంగా పేదల పట్ల చిత్తశుద్ది ఉంటే సిమెంటు, ఇసుక ధరలు.. ఆర్టీసీ టికెట్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. జ‌న‌సేన మండలాధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.. 86 శాతం ఎమ్మెల్యేలను ఇస్తే జనాన్ని ఇంత దగా చేస్తారా? అని ప్ర‌శ్నించారు.

రాష్ట్ర చరిత్రలో ప్రజల్ని ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి మరెవ్వరూ లేరన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంకి ప్రజల కష్టాలు తెలియదు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో గడప గడపకు సమస్యలు ఉన్నాయని..ఈ ప్ర‌భుత్వం మాత్రం ఏమీ ప‌ట్టించుకోవ‌టంలేద‌ని విమ‌ర్శించారు. "వైసీపీ ప్రభుత్వానికి సినిమా టిక్కెట్లు ,పవన్ కళ్యాణ్ తప్ప ఏమీ కనబడడం లేదు. గతంలో రూ.1500 దొరికిన ట్రక్కు ఇసుక ఇప్పుడు ఎంత ధర పలుకుతోంది? ఆర్టీసీ ధ‌ర‌లు పెంచి పండక్కి ఊరొచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు కుటుంబ సభ్యులతో కలసి స్వగ్రామాలకు తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మీకంటే గొప్పగా పని చేస్తున్నారని ప్రజలు చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వ కరపత్రాల మోసాన్ని తిప్పికొట్టండి.

రైతు భరోసా కింద కేంద్రం చేసిన సాయాన్ని కూడా కలిపేసుకుని మరీ చెపుతున్నారు. ప్రజల్ని మోసం చేసి ప్రభుత్వ డబ్బుతో దాన్ని ప్రాపగాండ చేస్తున్నారు. ఇంటింటికీ రేషన్ అన్నారు.. దాన్ని ఇప్పుడు సందుకు సందుకీ రేషన్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కరపత్రాల మోసాన్ని గడప గడపకు తీసుకువెళ్ళి ప్రభుత్వ మోసాన్ని వివరించాలి. గుంటూరు జిల్లాలో చూస్తే ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దోచుకున్న సొమ్ముతో రూ. 50 కోట్లతో ఇళ్లు కట్టుకుంటున్నారు. స్థలం కనబడితే అక్రమంగా లే అవుట్లు వేసేస్తున్నారు. కొండల్ని ఆక్రమించేస్తున్నారు. ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టపోయాం అంటే రకరకాల కాగితాలు అడిగి విసిగిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుని పలకరించే అధికారులు కనబడడం లేదు. ఇప్పుడు రెండో పంట వేసిన సమయంలో పంట నష్టం అంచనాకు కేంద్ర బృందం పర్యటనకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇస్తుందో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. గుంటూరు జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల్లో మిర్చి రైతులు నష్టపోయారు. ఎకరాకి రూ. 70 వేలు ఖర్చు చేశారు. వీరి గురించి ఎవరు మాట్లాడుతారు.' అన్నారు.

Next Story
Share it