కుప్పంలో ఓటమికి చంద్రబాబు రాజీనామా చేయాలి
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీనే అత్యధిక స్థానాలు దక్కించుకుందని..ఇప్పటికైనా ఆయన తన ఓటమిని అంగీకరించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 82.27 శాతం, రెండోదశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచిందన్నారు.
కుప్పంలో టీడీపీ కుప్పకూలిందని, వైఎస్సార్‌సీపీ 75 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. కుప్పంలో టీడీపీ 14 స్థానాలకే పరిమితమైందన్నారు. కుప్పంలో టీడీపీకి వచ్చిన 14 స్థానాలూ అరకొర మెజార్టీతో వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. ''కుప్పంలో మేం చేసిన అభివృద్ధే విజయానికి కారణం. చంద్రబాబు.. కుప్పంలోనే మెజారిటీ సాధించలేకపోయారు. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? లేక రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని'' మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.