Telugu Gateway
Politics

సొంత పార్టీ నుంచే ట్రంప్ కు మద్దతు కరవు

సొంత పార్టీ నుంచే ట్రంప్ కు మద్దతు కరవు
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓ వైపు ఓటమి వెంటాడుతోంది. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఆయన వైట్ హౌస్ ను వీడటం ఖాయం అని తేలిపోతుంది. అయితే అధికారిక ప్రకటన వెలువడటం ఒక్కటే ఆలశ్యం. పలు కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ అనూహ్యంగా పుంజుకోవటంతో కావాల్సిన దాని కంటే ఎక్కువ ఓట్లే వచ్చే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఇది అంతా ఒకెత్తు అయితే డొనాల్డ్ ట్రంప్ కు సొంత పార్టీ నుంచే ఏ మాత్రం మద్దతు లభించకపోవటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో అక్రమాలు అంటూ ట్రంప్ అధ్యక్ష ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. ఆయనకు మద్దతుగా ఒక్కరూ ప్రకటన ఇవ్వటం లేదు. దీనికి తోడు అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు కూడా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల అక్రమాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నాయి. అంతే కాదు..ఆయన మీడియా సమావేశాన్ని కూడా కొన్ని సంస్థలు అర్ధాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే ట్రంప్ తనయుడు జూనియర్‌ ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ. ''ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం. ఎవరు గట్టిగా పోరాడుతున్నారు.. ఎవరు పక్కన కూర్చుని చోద్యం చూస్తున్నారు? దశాబ్దాల కాలంగా రిపబ్లికన్లు వీక్‌గానే ఉన్నారు. వామపక్షం ఇలాంటి పనులు చేసేందుకు వారు అనుమతినిచ్చారు. ఇప్పటికైనా ఆ ట్రెండ్‌కు స్వస్తి పలకండి''అంటూ విరుచుకుపడ్డారు. డొనాల్డ్‌ ఒంటరిగానే పోరాడతారు, ఎప్పటిలాగానే వాళ్లు ఊరికే చూస్తూ కూర్చుంటారు''అంటూ ట్రంప్‌ జూనియర్‌, తన తండ్రి ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసిన నిక్కీ హేలిని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో నిలవనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ కూడా 2024 బరిలో ఉంటారని వార్తలు వెలువడుతున్నాయి.

Next Story
Share it