Telugu Gateway
Politics

చంద్ర‌బాబుకు ఓటేస్తే సంక్షేమానికి వ్య‌తిరేక‌మే

చంద్ర‌బాబుకు ఓటేస్తే సంక్షేమానికి వ్య‌తిరేక‌మే
X

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌జ‌ల‌కు మంచి చేశాన‌ని, చెప్పిన హామీలు అమ‌లు చేశాన‌ని న‌మ్మితేనే ప్ర‌జ‌లు త‌న‌కు ఓటు వేయాలన్నారు. ప్ర‌భుత్వం చేసిన మంచి ప‌నులను ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి వివ‌రించి చెప్పాల‌న్నారు. ఈ దిశగా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ఎమ్మెల్యేలు అంద‌రూ సిద్ధం కావాల‌న్నారు. వైసీపీ ప్లీన‌రీ చివ‌రి రోజైన శ‌నివారం నాడు జ‌గ‌న్ పార్టీ శ్రేణులను ఎన్నిక‌ల‌కు సిద్ధం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని అన్నారు. 'చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ఎన్నికల దగ్గరపడే కొద్దీ దుష్టచతుష్టయం దుష్ప్రచారం ఎక్కువైంది. అసత్యాలు, వెన్నుపోట్లు మనకు తెలీదు. వెన్నుపోటు ద్వారా అధికారం లాక్కోవడం నాకు తెలీదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు మనకు లేరు. ఈ దొంగల ముఠాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సంక్షేమ పథకాలను ఆపేయాలన్నేదే దుష్టచతుష్టయం కుట్ర. ఓట్ల కోసం దొంగ వాగ్దానాలతో చంద్రబాబు మళ్లీ మీ ముందకొస్తారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలవడమే మన లక్ష్యం. కుప్పం ప్రజలు కూడా మనల్ని దీవించారు. నాకున్న ఏకైక అండాదండా ప్రజలే' అని పేర్కొన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కంటే త‌క్కువ ఆప్పు చేసి ప్ర‌జ‌ల ఖాతాల్లో నేరుగా డ‌బ్బులేస్తున్నామ‌ని..కానీ చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన అప్పుల్లో కొంత ఈనాడుకు, కొంత ఆంధ్ర‌జ్యోతికి, మ‌రికొంత టీవీ5కి పంచేసి మిగ‌తాది చంద్ర‌బాబు దోచుకునేవాడ‌ని ఆరోపించారు.

కానీ ఇప్పుడు అలా లేద‌ని..నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లోకి వెళుతున్నాయ‌ని తెలిపారు. అందుకే ప్ర‌భుత్వంపై వీరు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్లీన‌రీకి హాజ‌రైన జ‌నాన్ని చూసి 'ఈరోజు జన సునామీ కనిపిస్తోంది. ఇది ఆత్మీయుల సునామీ. పదమూడేళ్లుగా ఇదే అభిమానం నాపై చూపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలు, అభిమానులకు నా సెల్యూట్‌. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పార్టీని గట్టి పునాదిపై నిర్మించుకున్నాం. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మేం మ్యానిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తున్నాం. నా ఫోకస్‌ అంతా ప్రజలకు మంచి చేయడం, వెనుక బడిన వర్గాలకు న్యాయం చేయడమే నా లక్ష్యం అని అన్నారాయన. ఒక్క ఎమ్మెల్యేలతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 151కి చేరింది. ఒక్క ఎంపీతో ప్రారంభమైన ప్రయాణం.. ఇప్పుడు 22కి చేరిందని గుర్తు చేసుకున్నారు. నిండు మనసుతో మీ అందరికీ సెల్యూట్‌ చేస్తున్నా అన్నారు.

Next Story
Share it