ఓట్ల లెక్కింపుపై కోర్టుకు వెళతామంటున్నట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ ఆధిక్యతలో ఉన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా బైడెన్ కు చాలా దగ్గరలో ఉండటంతో మార్పులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తుది ఫలితాలు వచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగనుంది. ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లు ఎవరికి వారు తాము గెలిచినట్లు ప్రకటించుకుంటున్నారు. తుది ఫలితాలు రావటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ట్రంప్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ''కోట్లాది అమెరికన్లకు నా ధన్యవాదాలు. ఎన్నికల్లో గెలవబోతున్నాం, భారీగా సంబరాలు చేసుకుంటాం.
ఫ్లోరిడాలో ఓడిపోతామనుకున్నాం, అయినా భారీ విజయం దక్కింది. కోట్లాది మంది ఉన్న టెక్సాస్‌లో మనం గెలిచాం. పెన్సిల్వేనియాలో మనం ఘన విజయం సాధిస్తున్నాం. మిషిగాన్‌లోనూ ఆధిక్యంలో ఉన్నాం, గెలుస్తాం. జార్జియాలోనూ ఊహించని విజయం దక్కబోతోంది. ఈ విజయం ఎవరూ ఊహించలేనిది. చివరి క్షణంలో ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారు. ఉదయం నాలుగు గంటల తర్వాత ఓట్ల లెక్కింపును ఆపాలి. దీని కోసం మేము సుప్రీం కోర్టుకు వెళతాం'' అని వ్యాఖ్యానించారు.