Telugu Gateway
Politics

కాంగ్రెస్ లోకి డీ.శ్రీనివాస్

కాంగ్రెస్ లోకి డీ.శ్రీనివాస్
X

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం. ఉమ్మ‌డి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్ అదికారంలోకి వ‌చ్చిన స‌మ‌యంలో పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న డి. శ్రీనివాస్ మ‌ళ్లీ సొంత గూటికి చేర‌నున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌త కొంత కాలంగా ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం కూడా ముగియ‌నుంది. గురువారం నాడు డి. శ్రీనివాస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో స‌మావేశం అయిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. డీఎస్ పార్టీలో చేరిక‌కు సోనియా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని..ఈ మేర‌కు రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సీఎం హోదాలో కేసీఆర్‌ స్వయంగా డీఎస్‌ ఇంటికెళ్లి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీ టికెట్‌పై నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి, సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించారు. ఆ తర్వాత తనకు తగిన గౌరవం ఇవ్వలేదని, వివిధ ఆరోపణలు చేసి అవమానించారని, డీఎస్‌ కొంతకాలంగా టీఆర్‌ఎస్‌కు దూరంగానే ఉంటున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో డీఎస్ కాంగ్రెస్ లోకి వ‌స్తే ఆయ‌న సీనియారిటి పార్టీకి మేలు చేయ‌గ‌ల‌ద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Next Story
Share it