స్థానిక ఎన్నికలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి
ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం రాజకీయంగా వేడిపుట్టిస్తోంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయటం రగడకు కారణమైంది. ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎస్ఈసీ మాత్రం వరస పెట్టి ఆదేశాలు జారీ చేసుకుంటూ వెళుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 'ఏపిలో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించ రాదు. తక్షణమే ఆయన జోక్యం చేసుకోవాలి. ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఈసిదే. పంచాయితీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) చెబుతోంది ఇదే.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశచరిత్రలో లేదు. ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనూ లేదు. మద్యం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయితీ ఎన్నికలకు ఉంటాయా..?. కోవిడ్ ప్రభావం ఉందని 2022జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా..?. ప్రతిపక్షాలపై దాడులు, అన్నివర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, చివరికి ఆలయాల ధ్వంసాలు. ప్రజల్లో ఆగ్రహం చూసే ఎన్నికల నిర్వహణకు సిఎం జగన్ రెడ్డి ఆటంకాలు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డి అండ్ కో కు లేకనే ఈ జగన్నాటకం. వైకాపా ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం(కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్)ను అడ్డుకోవాలి. శాంతియుతంగా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. ' అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.