Telugu Gateway
Politics

జగన్ తెలంగాణలో పార్టీ వద్దన్నారు

జగన్ తెలంగాణలో పార్టీ వద్దన్నారు
X

'వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు లేవు. అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో పార్టీ వద్దనేది జగన్ నిశ్చితాభిప్రాయం. ఈ విషయం షర్మిలకు కూడా స్పష్ట్టంగా చెప్పారు. కావాలనుకుంటే జగన్ జాతీయ స్థాయి రాజకీయాలకు కూడా వెళ్లొచ్చు. కానీ ఆయనకు స్పష్టత ఉంది. ఏపీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీ పెడితే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే స్పష్టమైన వైఖరితోనే జగన్ నిర్ణయం తీసుకున్నారు. ' అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం నాడు తాడేపల్లిలో మీడియాలో మాట్లాడుతూ షర్మిల పార్టీ ప్రయత్నాలపై స్పందించారు. అయితే షర్మిల తెలంగాణలో కూడా పాదయాత్ర చేసినందున ఆమె పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లు కన్పిస్తోందన్నారు. గత మూడు నెలలుగా ఈ అంశం చర్చలు సాగుతున్నాయని తెలిపారు.

తండ్రి స్పూర్తితో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌ రాష్ట్రానికి జవాబుదారీ. షర్మిల తీసుకున్న నిర్ణయం ఆమె సొంత నిర్ణయం. తెలంగాణలో మరో పార్టీ పెట్టాలన్నది షర్మిల ఆలోచనగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలో పార్టీపై చాలాసార్లు చర్చ జరిగింది. ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటాయని వైఎస్‌ జగన్‌ వద్దన్నారు. వైసీపీ తెలంగాణలో ఎందుకు ఉండకూడదు అన్న చర్చ వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశే ముఖ్యమని.. తెలంగాణలో పార్టీ వద్దని సీఎం జగన్‌ సూచించారు. అయితే ఓ అన్నగా తెలంగాణలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లపై జగన్ కు ఆందోళన ఉంటుందని పేర్కొన్నారు. ఏదో పదవులు ఇవ్వలేదని పార్టీ పెడుతున్నారనే వాదన సరికాదన్నారు.

Next Story
Share it