జగన్ పాలన అంతా తప్పులు..అప్పులే
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై మరోసారి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనంతా అప్పులు, తప్పులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులుగా సాగుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాక్రిష్ణపై జీరో ఎఫ్ ఐఆర్ నమోదుపై ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలనలో పౌరుల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని పేపర్లకే పరిమితం అయ్యాయన్నారు. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించిన వ్యవస్థల్ని జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరిగినా ఈ ప్రభుత్వం ఒక్కరిపైనా చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.
2430 జీవో తెచ్చి మీడియా గొంతు నొక్కారని, . ఇలాంటి అణిచివేత ధోరణి, కక్ష సాధింపుచర్యల వల్ల జగన్ రెడ్డి ఎంతటి నియంతో అర్థమవుతోంది. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాళ్లు ఎవరూ లేరు. ప్రజాక్షేత్రంలో మీ తప్పులకు శిక్ష తప్పదన్నారు. రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.'దాదాపు 30 గంటల తర్వాత జీరో ఎప్ఐఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనం. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, ఆ పార్టీ నేతల అవినీతిని ఏబీఎన్ సంస్ధలు ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రజలకు తెలియజేస్తున్నారన్న కారణంతో జగన్ రెడ్డి కక్షసాధిస్తున్నారన్నారు.