భాగ్యలక్ష్మి ఆలయం నుంచి భద్రఖాళీ ఆలయం వరకూ
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఆలయాల సెంటిమెంట్ బాగా కలసి వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని నమ్ముకున్నారు. ఒక్క బండి సంజయ్ కాదు...కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సమయంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఇఫ్పుడు బండి సంజయ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో భద్రఖాళీ ఆలయం గురించి ప్రస్తావిస్తున్నారు. మంగళవారం నాడు వరంగల్ లో పర్యటించిన బండి సంజయ్ భద్రఖాళీ ఆలయం అంశాన్ని ప్రస్తావిస్తూ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించింది. కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వరంగల్ అభివృద్ధిపై భద్రకాళీ టెంపుల్‌లో ప్రమాణానికి వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రులు సిద్ధమా? అని సవాల్ విసిరారు. వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. అంతే కాదు ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు సంజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని తాగి నడుపుతున్నారని ధ్వజమెత్తారు. కెసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్‌లో మంగళవారం జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మేయర్ ఎన్నిక ఎందుకు జరపడం లేదని విమర్శించారు. బీజేపీని చూస్తే కేసీఆర్‌కు భయమేస్తోందన్నారు. కేసీఆర్ పెద్ద తోపేం కాదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. వరంగల్‌లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. 'కేసీఆర్ దగుల్బాజీ ముఖ్యమంత్రి, బడాచోర్ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో జరిగినట్టే వరంగల్‌లోనూ జరగబోతోంది. వరంగల్‌లో బీజేపీ గెలవబోతోంది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. అందుకే వరంగల్‌లో ఎన్నికలు పెట్టడం లేదన్నారు.