నేను చెప్పిందే జరగబోతుంది
ఈ సారి పశ్చిమ బెంగాల్ ఎవరి పరం అవుతుంది?. మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా?. బిజెపి రాష్ట్రంలో తొలిసారి పాగా వేయగలుగుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఈ సారి మమతాకు చెక్ పెట్టేందుకు బిజెపి అన్ని అస్త్రాలు వాడుతోంది. ఓ వైపు టీఎంసీ నేతలను బిజెపిలో చేర్చుకుంటూ మరో వైపు ఆ పార్టీ నేతలపై పలు కేసులు తెరపైకి తెస్తూ తన విధానాలను అమలు చేస్తోంది. బిజెపి ఎన్ని చేసినా గెలుపు మాత్రం తమదే అని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది దశల్లో ఎన్నికల్లో జరిగినా ఫలితాల్లో మార్పేమీ ఉండదన్నారు. ఈ తరుణంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తాను చెప్పినట్లే మరోసారి పశ్చిమ బెంగాల్ ప్రజలు తమ పుత్రికను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య పోరుగా పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ ఐ ప్యాక్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో టీఎంసీకి సేవలు అందిస్తోంది. సరైన నాయకులను ఎంచుకునేందుకు, స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు బెంగాల్ ప్రజలు సన్నద్ధమయ్యారంటూ ట్వీట్ చేశారు. సీఎం మమత మరోసారి విజయభేరి మోగించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ మే 2 వరకు తనను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు చేసిన ట్వీట్ లో బిజెపికి పశ్చిమ బెంగాల్లో రెండంకెలకు మించి సీట్లు రావని స్పష్టం చేశారు. బిజెపి అనుకూల మీడియా మాత్రమే ఆ పార్టీని ఎక్కువ చేసి చూపిస్తోందని పేర్కొన్నారు. మరి ప్రశాంత్ కిషోర్ లెక్కలు నిజమో కాదో తేలాలంటే మే 2 వరకూ వేచిచూడాల్సిందే.