అశోక్ గజపతిరాజు జైలుకెళ్లకతప్పదు
తెలుగుదేశం సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనపై ఫోర్జరీ కేసు కూడా ఉందని..ఆయన జైలుకు వెళ్ళకతప్పదన్నారు.. 'మాన్సాస్ ట్రస్ట్‌లో వందల ఎకరాలు కాజేసిన దొంగ అశోక్‌గజపతిరాజు' అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ''భూకబ్జా వ్యవహారంలో టీడీపీ నేతలు తాత్కాలికంగా స్టే తెచ్చుకోగలిగారు. చేసిన తప్పులకు శిక్ష నుంచి మాత్రం తప్పుకోలేరు. ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిని వదిలిపెట్టేది లేదని'' అన్నారు.
సుప్రీం తీర్పు ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం ఉండకూడదన్నారు. కానీ మాన్సాస్ ట్రస్ట్ లో పురుషులే ఛైర్మన్ గా ఉండాలనే నిబంధన పెట్టారన్నారు. కొంత మంది స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజును తప్పించి..సంచయితను ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ హైకోర్టు ఈ నియమకాన్ని రద్దు చేస్తూ .ఛైర్మన్ గా అశోక్ గజపతిరాజును కొనసాగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.