Telugu Gateway
Politics

మ‌ళ్ళీ మోడీనే పీఎం..యోగీనే సీఎం

మ‌ళ్ళీ మోడీనే పీఎం..యోగీనే సీఎం
X

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బిజెపి విజ‌యం సాధిస్తే యోగి ఆదిత్య‌నాథే ముఖ్య‌మంత్రి అవుతార‌ని స్ప‌ష్టం చేశారు. యూపీలో సీఎం మార్పు ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో అమిత్ షా ఈ స్ప‌ష్ట‌త ఇచ్చారు. ఉత్త‌రప్ర‌దేశ్ తోపాటు 2024లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బిజెపి విజ‌యం సాధిస్తే మ‌రోసారి మోడీనే ప్ర‌ధాని అవుతార‌ని అన్నారు. బిజెపి నేత‌లు మ‌రోసారి త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఈ సారి పీఎం సీటులో అమిత్ షా కూర్చుంటార‌ని భావిస్తున్న త‌రుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్య‌లు చేయ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అదే స‌మ‌యంలో మోడీకి యోగి ఆదిత్య‌నాధ్ సవాల్ గా మారార‌నే ప్ర‌చారం ఉంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో బిజెపి నిర్వ‌హించిన స‌భ్య‌త్వ న‌మోదు కార్యక్ర‌మంలో పాల్గొన్న అమిత్ షా ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌ధాని మోడీ కావాల్సిన‌వి అన్నీ ఇచ్చార‌ని తెలిపారు. 2024లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఏడాది జ‌రిగే యూపీ ఎన్నిక‌ల్లో పునాది ప‌డాల‌న్నారు. బిజెపి వ‌చ్చే ఎన్నిక‌ల్లో 300 ఎంపీ సీట్ల‌ను సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. బిజెపి ఓవైపు యూపీలో దూకుడు చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో ముందుకు క‌ద‌ల‌టం లేద‌నే భావ‌న నేత‌ల్లో ఉంది. యూపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జి ప్రియాంక గాంధీ మాత్రం ఇటీవ‌ల కాస్త జోరు పెంచారు. ఆ పార్టీ ఆశ‌ల‌న్నీ ప్రియాంక‌పైనే పెట్టుకుంది. అంతే కాకుండా ఆమెను సీఎం అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తార‌నే ప్ర‌చారం కూడా ఉంది.

Next Story
Share it