అమెరికా జో బైడెన్ కే జై కొడుతుందా?!
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు మొదలయ్యాయి. మరి అమెరికా జై కొట్టేది ఎవరికి?. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తన పదవిని మరో నాలుగేళ్లు నిలబెట్టుకుంటారా?? డెమాక్రటిక్ అభ్యర్ధి జో బైడెన్ కు అప్పగిస్తారా?. విశేషం ఏమిటంటే సర్వేలన్నీ కూడా జో బైడెన్ కు అనుకూలంగా వెలువడుతుండటం. సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్, ఫాక్స్ న్యూస్ పోల్స్ అన్నీ కూడా ట్రంప్‌తో పోలిస్తే.. బైడెన్ 8 నుంచి 10 పాయింట్ల అధిక్యంలో కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. ఫాక్స్ న్యూస్ కూడా బైడెన్‌దే పైచేయి అని తేల్చేయడం గమనార్హం. ఫాక్స్ న్యూస్ సర్వే పోల్స్ లో బైడెన్ కంటే ట్రంప్ 8 పాయింట్లు వెనుకంజలో ఉన్నట్లు తేలింది. 2016 అధ్యక్ష ఎన్నికల పోల్స్ ఫలితాలతో పోలిస్తే ఈసారి బైడెన్‌కు మద్దతు కాస్తా ఎక్కువగా ఉంది. న్యూయార్క్స్ టైమ్స్ ప్రకారం ఒకవేళ ప్రీ పోల్స్ నిజమైతే.. బైడెన్ భారీ విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేసింది.
కరోనా భయంతో అమెరికన్లు ముందస్తు ఓటింగ్‌కే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మెయిల్ ఇన్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా మొత్తం 24 కోట్ల మంది రిజిస్టర్ ఓటర్లలో.. సుమారు 10 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ డే మంగళవారానికి ఒక్కరోజు ముందు సోమవారం వెలువడిన సీఎన్ఎన్ పోల్స్ ఫలితాలలోనూ బైడెన్ 10 పాయింట్ల స్పష్టమైన అధిక్యాన్ని ప్రదర్శించడం గమనార్హం. 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో గెలిచి అధ్యక్షుడైన ట్రంప్ ఈసారి అక్కడ సైతం వెనుకంజలో ఉన్నట్లు సీఎన్ఎన్ నివేదిక పేర్కొంది. హోరాహోరీ పోరు ఉండే మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెనే మెరుగైన స్థితిలో ఉన్నారని సీఎన్ఎన్ తాజా నివేదిక తెలిపింది. ఈసారి పోల్స్ ఫలితాలు నిజమైతే మాత్రం బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడం ఖాయం.