టీడీపీ పరువు తీసిన కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పరువు తీశారు. సహజంగా సీఎం జగన్ ఏది అంటే టీడీపీ దానికి రివర్స్ అనాలి. కానీ రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాత్రం జగన్ ను ప్రశ్నించిన టీడీపీ మరి అదే తప్పు ఎందుకు చేసినట్లు?. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన ప్రత్యేక హోదా..ఇతర హామీలు అమలు చేయకపోయినా..జగన్ ఎలాంటి డిమాండ్లు పెట్టకుండానే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించటాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టారు. కానీ అదే టీడీపీ ఇప్పుడు అసలు అడగపోయినా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించింది. అంతే కాదు.గతంలో మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అన్నీ మర్చిపోయి అసలు ముర్ము అభ్యర్ధిత్వం ఖరారు చేయటమే గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించారు. బిజెపి ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు విషయంలో ఏ ప్రశ్నలు అయితే టీడీపీ నేతలు జగన్ ముందు పెట్టారో అవే ప్రశ్నలు టీడీపీకి కూడా వర్తిస్తాయి కదా మరి.వాటి అన్నింటిని మర్చిపోయి ఇప్పుడు మద్దతు ఇవ్వటమే కాకుండా ఏకంగా మోడీని పొగడటానికి కూడా చంద్రబాబు పోటీపడ్డారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీడీపీ పరువుతీసే విధంగా వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది.
ఓ వైపు టీడీపీ మద్దతు ఇవ్వటాన్ని స్వాగతిస్తూనే..స్వచ్చందంగా మద్దతు ఇచ్చారు అని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. అదే సమయంలో మంచి ఆశయంతో మద్దతు ఇచ్చారంటూ కూడా ప్రశసించారు. ఏది ఏమైనా అటు బిజెపి పెద్దలు ఎవరూ అడక్కుండానే టీడీపీ ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిందనే విషయం కిషన్ రెడ్డి మాటల్లో తేలిపోయందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మంగళవారం నాడు ఏపీలో పర్యటంచిన ద్రౌపది ముర్ము తొలుత వైసీపీ నేతలతో సమావేశం అయి తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితోపాటు ఆ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయ్యారు. అయితే కొంత మంది వైసీపీ నేతలు కేవలం విమానాశ్రయంలో మాత్రమే ద్రౌపతి ముర్ముతో టీడీపీ నేతలకు కలిసే చాన్స్ ఇవ్వాలని..హోటల్ లో భేటీ వద్దని ఒత్తిడి చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ తనంతట తానుమద్దతు ఇస్తామని ప్రకటించిన తరుణంలో అలా చేయటంతో సరికాదని..హోటల్ లోనే ఈ సమావేశం ఏర్పాటు చేశారని ఓ నాయకుడు వెల్లడించారు.



