Telugu Gateway
Movie reviews

తెలిసిన కథ చెప్పటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారా?(Yatra 2 Movie Review)

తెలిసిన కథ చెప్పటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారా?(Yatra 2 Movie Review)
X

గత ఎన్నికలకు ముందు వచ్చిన వైఎస్ఆర్ బయో పిక్ యాత్ర సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8 న యాత్ర మూవీ విడుదల కాగా...ఇప్పుడు యాత్ర 2 సినిమాను కూడా సరిగ్గా 2024 ఫిబ్రవరి 8 న విడుదల చేశారు. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు చూస్తే అప్పుడైనా...ఇప్పుడైనా ఎన్నికలే లక్ష్యంగా వీటిని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలను తెరకెక్కించింది దర్శకుడు మహి వి రాఘవ్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఏ సినిమా విషయంలో అయినా కథలో సస్పెన్స్ ఉంటే...ప్రేక్షకుడికి తెలియని విషయాలు ఉంటే అది సక్సెస్ అవుతుంది. కానీ అందరికీ తెలిసిన కథ ను ఆకట్టుకునేలా చెప్పటం అంటే అది అంత ఆషామాషీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆ ప్రభావం సినిమా మొత్తంపై పడుతుంది. అయితే యాత్ర 2 సినిమా పూర్తిగా జగన్ కోణంలో...వైసీపీ కోణంలో సాగిన సినిమా. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో సోనియా గాంధీ నే విలన్ గా చూపించారు అనే చెప్పొచ్చు. చంద్రబాబు పాత్రదారి ఉన్నా కూడా ఫోకస్ ఎక్కువగా సోనియా పైనే పెట్టారు. 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా జగన్ ను బరిలోకి దింపుతున్నట్లు ఒక సభలో పరిచయం చేసే సన్నివేశంతో యాత్ర 2 సినిమా ప్రారంభం అవుతుంది.

ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణం...జగన్ ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంత మంది చేప్పట్టిన సంతకాల సేకరణ, ఓదార్పు యాత్రకు అధిష్టానం నో చెప్పినందుకు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన జగన్ తర్వాత ఎంపీగా రాజీనామా చేసి మళ్ళీ గెలవటం, పాదయాత్ర...ఫైనల్ గా 2019 లో జగన్ సీఎం అయిన సన్నివేశాలతో సినిమాను ముగించారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి ఎంత బాగా చేశారో..యాత్ర సినిమాలోనే ప్రేక్షకులు చూశారు. యాత్ర 2 లో అయన ఉండేది కొద్ధిసేపే అయినా ఉన్నంత సేపు మంచి ప్రభావం చూపించారు అనే చెప్పాలి. ఇక జగన్ పాత్ర పోషించిన జీవా విషయానికి వస్తే ముఖ్యంగా జగన్ మ్యానరిజమ్స్ దింపేశాడు. ఈ సినిమా కు అసెట్ ...ఈ సినిమా ను ఈ మాత్రం నిలిపింది అంటే అది పూర్తిగా సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. జగన్, షర్మిల మధ్య వచ్చిన వివాదాల కారణంగా ఈ సినిమాలో ఆమె ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాస్తవానికి జగన్ అరెస్ట్ అయిన సమయంలోనూ...2019 ఎన్నికల ముందు ఆమె పార్టీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. యాత్ర సినిమాలో ఉన్న భావోద్వేగాలు యాత్ర 2 లో కనిపించవు. నాయకులను కాదు..పూర్తిగా ప్రజలను నమ్ముకున్న రాజకీయాలు చేయమని జగన్ కు రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లు ఇందులో చూపించారు. దర్శకుడు మహి వి రాఘవ్ పూర్తిగా జగన్ కు ఎలివేషన్స్ ఇస్తూ ..అయన ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు. ఇది జగన్, వైసీపీ అభిమానుల సినిమా.

Next Story
Share it