యశోద మూవీ రివ్యూ
అందం. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. ఒక పెద్ద వ్యాపారం కూడా . వయస్సు మళ్ళినా అందం ఏ మాత్రం తగ్గదు..ఎప్పటికి యవ్వనంలో ఉన్నట్లే కన్పిస్తారు అంటే దీనికి కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు. అంతే కాదు దీని కోసం ఏమి చేయటానికి అయినా వెనకాడని వారు ఉంటారు కూడా. ఇది ఒక్క భారత దేశంలోనే కాదు..అగ్ర రాజ్యంగా పిలవబడే అమెరికాలోనే ఇదే పరిస్థితి ఉంటుంది. పైకి చాలా మంది అందం ఏముంది ఉంది ..అంతః సౌందర్యం ముఖ్యం అంటూ మాట్లాడుతారు కూడా. కానీ వాళ్ళు కూడా చివరకు అందం వెంట పడతారు. సరిగ్గా ఇదే సబ్జెక్టును తీసుకుని సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమానే యశోద. కొద్దీ రోజుల క్రితం సమంత ఇదే సినిమా కు ఆస్పత్రిలో ఉండి మరి డబ్బింగ్ చెపుతున్న ఫోటోను విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులోనే తాను మయోసిటిస్ అనే జబ్బుతో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా యశోద సినిమా ప్రమోషన్ కోసం సుమకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఇక ఈ విషయం పక్కన పెడితే పుష్ప లో ఐటెం సాంగ్ చేసిన తర్వాత సమంత చేసిన పూర్తి స్థాయి సినిమా ఇదే. అంతే కాదు ఈ సినిమా సమంత కు మరో సూపర్ హిట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. పైకి యశోద సినిమా సరోగసి అంశం ఆధారంగా తెరకెక్కినట్లు కనిపించినా అసలు కథ మాత్రం వేరే ఉంటుంది. దర్శకులు హరి-హరీష్ లు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకే బాగా కలిసొచ్చింది. పేదరికంలో ఉన్న అమ్మాయిలు రక రకాల కారణాలతో సరోగసి కి ఒప్పుకోవటం...అందులో ఒక అమ్మాయి అయితే చివరకు ఐ ఫోన్ కొనుక్కోవటాని సరోగసి తో బిడ్డకు జన్మఇవ్వడానికి సిద్ధం అవుతుంది. తర్వాత అసలు విషయం తెలుస్తుంది. సరోగసి కింద బిడ్డలకు జన్మనిచ్చేందుకు వచ్చిన యువతులు అందరు ఈవా ఆస్పత్రిలో ఉంటారు. అక్కడ వర లక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ లు ఏమి చేస్తారు..వీరి వెనక ఉన్న కేంద్ర మంత్రి రావు రమేష్ ల పాత్ర ఇందులో ఏమిటి అన్నది వెండి తెరపైనే చూడాలి. డబ్బుల కోసం సరోగసి కి ఒప్పుకొనే యువతులు పడే సంఘర్షణ, అదే సమయంలో వాళ్ళు ఫీల్ అయ్యే మాతృత్వపు భావోద్వేగాలు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. ఈ సినిమా లో సమంత ఒక వైపు సరోగసి కోసం వచ్చిన మహిళగా కనిపిస్తూ సెకండ్ హాఫ్ లో మాత్రం ట్విస్ట్ ఇస్తారు. యశోద కొత్తదనం తో కూడిన సస్పెన్సు థ్రిల్లర్. ముఖ్యంగా ఈ సినిమా మహిళలను పెద్ద ఎత్తున ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ద్వారా సమంత మరో సారి తన సత్తా చాటారు. ఆరోగ్యపరంగా సవాళ్లు ఎదుర్కుంటున్న సమంత కు యశోద సినిమా సూపర్ హిట్ అవ్వటం మరింత శక్తిని ఇవ్వటం ఖాయం అని చెప్పుకోవచ్చు.
రేటింగ్.3 5 -5